కొత్తగూడెం: బందువుల సందడి, మేళతాళాల చప్పుళ్లతో కళకళలాడాల్సిన పెళ్లింట విషాదం నెలకొంది. అతివేగంతో వెళుతున్న పెళ్లి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో 33మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్ధితి విషమంగా వునట్లు తెలుస్తోంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... ఇల్లెందు సమీపంలోకి కన్నాయిగూడెం గ్రామానికి చెందిన యువకుడు మహేష్ కు నర్సాపురం గ్రామానికి చెందిన అనూషతో ఇవాళ(బుధవారం) పెళ్ళి జరగాల్సి వుంది. అయితే పెళ్లికి ముందురోజు(మంగళవారం) పెళ్లికూతురు ఇంట జరిగే ప్రదానం కార్యక్రమంలో పాల్గొనడానికి వరుడి కుటుంబసభ్యులు,బంధువులు ఓ ట్రాక్టర్ లో వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని రాత్రి సమయంలో తిరిగి వస్తుండగా వేగంగా వెళుతున్న ట్రాక్టర్ ప్రమాదానికి గురయ్యింది. 

 ఒక్కసారిగా అదుపుతప్పిన ట్రాక్టర్ రోడ్డుపైనే బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 35మందిలో 33మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా వుంది. గాయపడిన క్షతగాత్రులకు గుండాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తుండగా... విషమంగా ఉన్నవారిని ఇల్లెందు హాస్పిటల్ కు తరలించారు.