తెలంగాణ ఇంటర్ ఫలితాలు, గ్లోబరీనా సంస్థ వైఫల్యం నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేటీఆర్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే గ్లోబరీనాకు ఇంటర్ పరీక్షల నిర్వహణ కాంట్రాక్టును కట్టబెట్టారని రేవంత్ ఆరోపించారు.

సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ను కాదని అర్హత లేని గ్లోబరీనా కాంట్రాక్టు ఇచ్చారని రేవంత్ ఆరోపించారు. ప్రభుత్వ సంస్థను కాదని ప్రైవేట్ సంస్థలకు టెండర్లు ఎలా వెళ్లాయని ప్రశ్నించారు. ఇప్పుడేమో గ్లోబరీనా సంస్థ తనకు తెలియదంటూ కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్లోబరీనా సంస్ధతో సంబంధాలు లేవని చెప్పినంత మాత్రాన తప్పించుకోలేవని కేటీఆర్ హెచ్చరించారు. గతంలో పరీక్షల నిర్వహణ పారదర్శకంగా ఉండేందుకు హాల్ టికెట్ల జారీ, జవాబు పత్రాల వాల్యుయేషన్, ఫలితాల ప్రకటనను మూడు దశలుగా విభజించి ఒక్కో దశను ఒక్కో సంస్థకు అప్పజెప్పేవారన్నారు.

1996 నుంచి 2016 వరకు ఇదే విధానాన్ని పాటించారు. ఇంటర్ పరీక్షలను సీజీసీ నిర్వహించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదని రేవంత్ గుర్తు చేశారు. ఎంసెట్-2 స్కాంకు పాల్పడిన మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్, గ్లోబరీనా ఒక్కటేనని రేవంత్ ఆరోపించారు.

2016లో తెలంగాణ ఎంసెట్ లీకేజీ వెనక మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్ ప్రధాన పాత్ర పోషించిందన్నారు. ఆ సంస్ధ డైరెక్టర్ విజయరామారావు అల్లుడు ప్రద్యుమ్న కేటీఆర్ క్లాస్‌మేట్ ‌అని.. మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్ ప్రద్యుమ్న కూడా ఓ డైరెక్టర్ అందుకే మూడేళ్లు గడుస్తున్నా ఎంసెట్ లీకేజీ కేసులో మ్యాగ్నటిక్ సంస్థ అధిపతులపై కేసులు లేవని రేవంత్ ఆరోపించారు.

మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్, గ్లోబరీనా సంస్థల పేర్లు మాత్రమే వేరని, ఆ రెండు సంస్థలకు యజమానులంతా ఒక్కటేనని చెప్పారు. ఈ రెండు కలిసి జేఎన్‌టీయూ-కాకినాడను మోసం చేశాయని రేవంత్ గుర్తు చేశారు.

ఇంటర్ పరీక్ష ఫలితాల టెండర్ల కోసం మ్యాగ్నటిక్, గ్లోబరీనా పోటీ పడ్డాయని ప్రభుత్వం చెప్పిందన్నారు. మ్యాగ్నిటిక్ కంటే రూ.2 లక్షలు తక్కువగా కోట్ చేసినందుకు గ్లోబరీనాకు బాధ్యతలు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోందని రేవంత్ తెలిపారు.

గతంలో తప్పులు చేసినందుకు మ్యాగ్నిటిక్‌ను ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డు నిషేధించాయని.. అలాంటి సంస్థ కంటే తక్కువకు టెండర్ వేసిన వాళ్లకు పనులు అప్పగించారంటేనే అందులోని మతలబును అర్ధం చేసుకోవాలని రేవంత్ ఎద్దేవా చేశారు.

అలాగే విద్యార్ధుల డేటాను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వకూడదని, అలాంటిది గ్లోబరీనాకు టెండర్ ఇచ్చి మరీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, ఇది లోపభూయిష్టమని ఆయన ఎద్దేవా చేశారు.

ఏపీ ఓటర్ల సమాచారాన్ని ఓ ప్రైవేటు సంస్ధ దొంగిలించని గగ్గోలు పెడుతున్న కేసీఆర్.. మరి ఏ నిబంధన కింద 10 లక్షల మంది పిల్లల వివరాలను గ్లోబరీనా చేతిలో పెట్టారని నిలదీశారు.

ఎంసెట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై 2016లో సీబీసీఐడీ విచారణకు ఆదేశించారని, మ్యాగ్నటిక్‌ను పక్కనబెట్టి ఇతరుల చుట్టూ కేసును తిప్పారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రావత్, కమలేశ్‌లను ఎంసెట్ లీకేజీ కేసులో ప్రధాన ముద్దాయిలుగా తేల్చారని.. రావంత్ సీఐడీ కస్టడీలోనే మరణించగా.. కమలేశ్ అనుమానాస్పదంగా మరణించారని తెలిపారు.

2016లో జరిగిన ఈ కేసు విషయంలో మూడేళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదో కేసీఆర్ చెప్పాలని ... కేసు విచారణను ముందుకు వెళ్లనీయకుండా ప్రభుత్వమే నీరు గార్చిందని రేవంత్ దుయ్యబట్టారు.

ఏటా కార్పోరేట్ కాలేజీలు రూ.10 వేల కోట్ల విద్యా వ్యాపారం చేస్తున్నాయని, ఆ కాలేజీల మాఫియాకు గ్లోబరీనా అమ్ముడుపోయిందని రేవంత్ ధ్వజమెత్తారు. ఈ ఒప్పందంలో భాగంగా ఎవరికి ఎన్ని మార్కులు కావాలంటే అన్ని మార్కులు వేస్తోందని ఎద్దేవా చేశారు.

సరైన విచారణ జరిగితే ఇది వ్యాపం కుంభకోణాన్ని మించిపొతుందని చెప్పారు. గ్లోబరీనా అధిపతి రాజు వెనుక ఉన్న యువరాజు ఎవరో స్వతంత్ర సంస్ధతో విచారణ జరిపితే తేలిపోతుందంటూ పరోక్షంగా కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ రేవంత్ నిప్పులు చెరిగారు.

ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలపై విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నా.. 23 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నా  రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ బాధ్యతలను మళ్లీ గ్లోబరీనాకే కట్టబెట్టడం సరికాదన్నారు.

దీని వెనుక ఉన్నదెవరని రేవంత్ ప్రశ్నించారు. వెంటనే రీవాల్యుయేషన్ బాధ్యతల నుంచి గ్లోబరీనాను తప్పించాలని డిమాండ్ చేశారు. మ్యాగ్నటిక్, గ్లోబరీనా అధిపతులతో పాటు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి అశోక్‌పై కేసులు పెడితే తమ అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న ఆందోళనలో కేసీఆర్ ప్రభుత్వం ఉందన్నారు.

ఈ రెండు సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోలేదో 24 గంటల్లోగా సమాధానం చెప్పాలని, ఆత్మహత్య చేసుకున్న ప్రతి విద్యార్ధి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి రేవంత్ హెచ్చరికలు పంపారు. అప్పటికే ప్రభుత్వం దిగి రాకపోతే జాతీయ స్థాయిలో పోరాటం చేపడతామన్నారు.