ఎమ్మెల్సీ అభ్యర్థులకు జగ్గారెడ్డి సంతకంతో బీఫారాలు .... కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చే అవకాశం టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి దక్కింది. టిపిసిసి చీఫ్ రేవంత్ విదేశీ పర్యటనలో వున్న నేపథ్యంలో జగ్గారెడ్డికి ఈ అవకాశం దక్కింది.
హైదరాబాద్ : తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు కాదు... పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నాయకుడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఓటమిపాలవడంతో ఆయన ఎక్కడా కనిపించడంలేదు. పార్టీతో గానీ, ప్రభుత్వంతో గానీ అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో జగ్గారెడ్డికి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అరుదైన అవకాశం దక్కింది.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో వున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిపికేషన్ వెలువడి నామినేషన్లకు రేపటితో (జనవరి 18) గడువు కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులకు భీపారాలు ఇచ్చే బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలు జగ్గారెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల బీఫారాలపై సంతకం చేసి ఇవ్వనున్నారు.
ఇక కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులతో నామినేషన్లు వేయించే ప్రక్రియ, ఎమ్మెల్యేలలో ప్రతిపాదిత సంతకాలు చేయించే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పగించారు. ఇలా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ఎలాంటి పొరపాట్లు జరక్కుండా చూసుకునే బాధ్యత భట్టికి అప్పగించారు.
Also Read ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. మంత్రి వర్గంలోకి తీసుకునే ఛాన్స్..
ఇదిలావుంటే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏఐసిసి కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ పేరు ఖరారయినట్లు ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఎన్ఎస్ యూఐ నేత బల్మూరి వెంకట్ పేరు తెరపైకి వచ్చింది. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు సిద్దం కావాలని... అన్ని పత్రాలను రెడీ చేసుకోవాలని అదిష్టానం సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి పేర్లను కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.