మోడీకి కేసీఆర్ ఏజంట్: ఉత్తమ్ ధ్వజం

First Published 21, Jul 2018, 4:13 PM IST
TPCC president Uttam Kumar Reddy slams on KCR
Highlights

టీఆర్ఎస్‌కు ఓటేస్తే  బీజేపీకి ఓటేసినట్టేనని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి  చెప్పారు. టీఆర్ఎస్‌కు, బీజేపీకి మధ్య రహస్య  ఒప్పందం ఉన్న విషయం బట్టబయలైందన్నారు. 

హైదరాబాద్:టీఆర్ఎస్‌కు ఓటేస్తే  బీజేపీకి ఓటేసినట్టేనని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి  చెప్పారు. టీఆర్ఎస్‌కు, బీజేపీకి మధ్య రహస్య  ఒప్పందం ఉన్న విషయం బట్టబయలైందన్నారు. 

శనివారంనాడు హైద్రాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో  కేసీఆర్ పాత్ర లేదని మోడీ పార్లమెంట్ వేదికగా చెప్పారని ఆయన గుర్తు చేశారు.  పార్లమెంట్ తలుపులు మూసేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని మోడీ చెప్పారన్నారు.

పార్లమెంట్,అసెంబ్లీలో ఏదైనా అంశంపై ఓటింగ్ జరిగే సమయంలో  తలుపులు మూసివేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. పార్లమెంట్ వేదికగా మోడీ ఈ విషయాన్ని చెప్పారన్నారు.

కేసీఆర్‌ను  మోడీ ప్రశంసలతో ముంచెత్తారని ఉత్తమ్‌ చెప్పారు. ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని మరోసారి తేలిందన్నారు. టీఆర్ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టేనని ఉత్తమ్  తెలిపారు. పార్లమెంట్ వేదికగా  ముస్లిం మైనార్టీల రిజర్వేషన్ల గురించి టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు.

మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ‌పార్టీదేనని ఆయన చెప్పారు.  తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్రా సెటిలర్లు కూడ ఏపీకి కూడ న్యాయం చేయాలని ఎవరు కోరుకొంటున్నారో  ఆలోచించాలని ఉత్తమ్ కోరారు. 

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు పెద్ద నగదు నోట్ల రద్దు విషయంలో కూడ బీజేపీకి టీఆర్ఎస్ మద్దతిచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మోడీకి కేసీఆర్ ఏజంటు అని ఉత్తమ్ ఆరోపించారు. ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు. 

loader