లో‌క్‌సభలో ప్రధాని మోడీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కౌగిలించుకోవడం మంచి సందేశమని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి  అభిప్రాయపడ్డారు. 


హైదరాబాద్: లో‌క్‌సభలో ప్రధాని మోడీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కౌగిలించుకోవడం మంచి సందేశమని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

శనివారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మీరు ద్వేషించినా... మేం ప్రేమిస్తున్నామనే సందేశాన్ని రాహుల్ ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దేశంలో రాజకీయాలను మోడీ వికృతంగా మార్చారని ఆయన విమర్శించారు. కానీ, దేశం కోసం ప్రేమిస్తామనే సందేశాన్ని పార్లమెంట్ వేదికగా రాహుల్ ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

కేసీఆర్ మోడీ ఏజంట్‌ అనే విషయం మరోసారి పార్లమెంట్ వేదికగా రుజువైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మోడీని అసెంబ్లీ వేదికగా విమర్శలు చేయొద్దని కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ ఎవరితో స్నేహంగా ఉంటారనే విషయం తేటతెల్లమైందన్నారు.

తెలంగాణ ఏర్పాటు గురించి మోడీ అత్యంత అవమానకరంగా మాట్లాడారని ఉత్తమ్ విమర్శించారు.మోడీ తెలంగాణ ప్రజలను అవమానపర్చేలా మాట్లాడితే పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు నోరు మెదపలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌కు బీజేపీకి, టీఆర్ఎస్‌కు ఎంఐఎంకు మధ్య ఒప్పందాలు ఉన్నాయని ఆయన చెప్పారు.