హైదరాబాద్:హుజూర్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం మంగళవారం నాడు మధ్యాహ్నం హైద్రాబాద్‌ గాంధీ భవన్ లో జరగనుంది.రానున్న రోజుల్లో రాష్ట్రంలో  అనుసరించిన వ్యూహాంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశంలో  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎఐసీసీ కార్యదర్శులు ,ఎఐసీసీ ప్రధానకార్యదర్శులు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఆర్ సీ కుంతియా తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

టీపీసీసీ చీఫ్ పదవి నుండి  ఉత్తమ్ కుమార్ రెడ్డిని తప్పించాలని కొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవి కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి 43వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ పరిణామం కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశను నింపింది. 

హుజూర్‌నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణికి టిక్కెట్టు ఇవ్వడాన్ని రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు. కానీ, ఈ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు అండగా నిలిచారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతి తరపున ప్రచారం నిర్వహించారు.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో తన భార్య పద్మావతిని గెలిపించుకోలేకపోయిన సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా ఈ పదవిలో కొనసాగుతారని ఆయన ప్రత్యర్ధులు కొందరు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తూర్పు జయప్రకాష్ రెడ్డి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత జగ్గారెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశంలో హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితంపై చర్చ జరిగే సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత ఇబ్బంది పడే అవకాశం లేకపోలేదు. కోర్ కమిటీ కంటే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాత్రం ఈ విషయమై ఉత్తమ్ కు ఇబ్బంది తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం  చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ ను ముట్టడించడం విషయమై తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ప్రశ్నిస్తున్నారు.  ఈ కార్యక్రమాన్ని పార్టీ నేతలకు తెలియకుండానే రేవంత్ రెడ్డి ఎలా ప్రకటిస్తారని కొందరు సీనియర్లు రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ప్రశ్నిస్తున్నారు.

ఇదే విషయమై రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని కాంగ్రెస్ సీనియర్లు తప్పుబట్టారు,. రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రకటించాడని కూడ ప్రశ్నిస్తున్నారు.ఈ విషయమై కూడ కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం లేకపోలేదు.

మరో వైపు త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడ  కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీలో చర్చించనున్నారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో గణనీయమైన సంఖ్యలో స్థానాలను దక్కించుకోవాలని  కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.