కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్

కాంగ్రెస్ లో ఇంటిపోరుతో ఆ పార్టీ నేతలకు తలనొప్పులు మొదలయ్యాయి. టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వేను అదే పార్టీకి చెందిన సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తప్పుపట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు ఉత్తమ్ కు కూడా ఆయన చురకలు అంటించారు.

చాలా విషయాల్లో పార్టీ నేతలు గీతదాటినా కాంగ్రెస్ లో పెద్దగా చర్యలుండవు. అయితే ఈ విషయాన్ని మాత్రం పార్టీ చాలా సీరియస్ గానే తీసుకున్నట్లుంది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారని, ఆయన ఇలా పార్టీ గీత దాటి మాట్లాడటం ఇది రెండవసారని పీసీసీ ఉపాధ్యాక్షుడు మల్లు రవి పేర్కొన్నారు.

కోమటిరెడ్డి వ్యాఖ్యలు టిఆర్ఎస్ నాయకుడు మాట్లాడినట్లుగా ఉన్నాయని మండిపడ్డారు.

పార్టీ వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్వే చేయిస్తే .. దాన్ని బోగస్ సర్వే అంటూ మాట్లాడటం సరికాదని.. పార్టీ క్యాడర్ మనోధైర్యం దెబ్బతినేలా మాట్లాడటం సరికాదని కోమటి రెడ్డికి సూచించారు.

కాగా, కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ లో చీలిక తీసుకురావాలని కేసిఆర్ కుట్ర పూరితంగా ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.

పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యల వెనక సీఎం కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి పార్టీకి విఘాతం కలిగించేలా మాట్లాడారు. పార్టీలో ఎన్నో ఉన్నత పదవులు అనుభవించి .. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అస్తిత్వం కోల్పోయేలా కోమటిరెడ్డి మాట్లాడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు.