Asianet News TeluguAsianet News Telugu

జూమ్ మీటింగ్‌కు డుమ్మా... 11 మంది అధికార ప్రతినిధులకు టీపీపీసీ షోకాజ్ నోటీసులు

తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన జూమ్ మీటింగ్‌కు డుమ్మా కొట్టిన 11 మంది అధికార ప్రతినిధులపై టీపీసీసీ ఫైర్ అయ్యింది. ఈ మేరకు వారందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 

tpcc issued cause notice to 11 official spokespersons
Author
First Published Nov 20, 2022, 2:19 PM IST

11 మంది అధికార ప్రతినిధులకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నిన్నటి జూమ్ మీటింగ్‌కు ఈ 11 మంది గైర్హాజరయ్యారు. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. నిన్నటి మీటింగ్‌కు కేవలం ఇద్దరు అధికార ప్రతినిధులు మాత్రమే హాజరవ్వడంతో పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

మరోవైపు.. ఈ జూమ్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంది టీ.కాంగ్రెస్. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో పాటు బీజేపీ, టీఆర్ఎస్ విధానాలపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది. ఎల్లుండి నుంచి డిసెంబర్ 5 వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చినట్లుగా సమాచారం.  మండల కేంద్రాలు, కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేయాలని నిర్ణయించారు. 

ఇక ఇదే మీటింగ్‌కు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు జగ్గారెడ్డి. దీనిపై ఆయనకు ఫోన్ చేశారు ఏఐసీసీ కార్యదర్శి జావెద్. పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలపై ఆరా తీశారు. మర్రి శశిధర్ రెడ్డి పార్టీని వీడటానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలదేనన్న వ్యాఖ్యలపై జావెద్ వివరణ కోరినట్లు సమాచారం. 

Also REad:రేవంత్, భట్టిలపై అసంతృప్తి.. జూమ్ మీటింగ్‌కు డుమ్మా కొట్టిన జగ్గారెడ్డి

అంతకుముందు నిన్న జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పది మంది కూడా కూర్చొలేని పరిస్థితి ఉందన్నారు. దీనికి తాను కూడా బాధ్యుడినేనని చెప్పారు. భవిష్యత్తులో పీసీసీ అవకాశం ఇస్తే.. అన్ని చేస్తానని తెలిపారు. తనకు పీసీసీ అవకాశం ఇస్తే తన దగ్గర మెడిసిన్ ఉందని చెప్పారు. ఎన్నికల ముందు పీసీసీని మార్చమని తాను చెప్పడం లేదన్నారు. మీడియాలో వచ్చినట్టుగా మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారితే  కాంగ్రెస్‌కు నష్టమేనని చెప్పారు. దానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కదేనని తెలిపారు. 

పాదయాత్రలో రేవంత్ రెడ్డి వన్ మ్యాన్‌ షో చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఆయన ఒక్కడే పనిచేస్తున్నానని బిల్డప్ ఇచ్చారని ఆరోపించారు. మునుగోడులో కాంగ్రెస్ ఓటమికి రేవంత్ రెడ్డిదే బాధ్యత అని అన్నారు. ఓటర్లకు డబ్బులిచ్చి చెడగొట్టింది రాజకీయ పార్టీలేనని అన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించిన జగ్గారెడ్డి.. 50 కోట్లు ఇచ్చిన వ్యక్తికి రేవంత్ రెడ్డి టికెట్ ఇస్తారా? అని ప్రశ్నించారు. పాల్వాయి స్రవంతికి ఆమె తండ్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డి పేరుతో టికెట్ వచ్చిందని చెప్పారు. రేవంత్ రెడ్డి పీసీసీ హోదా మరిచిపోయి టీవీల్లో మాట్లాడుతున్నారని విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios