పోలవరంతో ముంపు ఉందని ఇప్పుడు తెలిసిందా?:టీఆర్ఎస్ కి ఉత్తమ్ కౌంటర్
పోలవరం వల్ల ముంపు సమస్య ఉందని కేసీఆర్ కు ఇప్పుడు తెలిసిందా అని టీపీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల కామెంట్స్ ను ఆయన తప్పుబట్టారు.
హైదరాబాద్: Polavaram వల్ల ముంపు సమస్య ఉందని KCR కు ఇప్పుడు తెలిసిందా అని టీపీసీసీ మాజీ చీఫ్ Uttam kumar Reddy ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతున్న తరుణంలో ఈ ప్రాజెక్టుతో భద్రాచలం ముంపునకు గురౌతుందని TRS నేతలు చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు.
Telanganaకు కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణకు చెందిన ఏడు మండలాలను Andhra Pradesh లో కలుపుకున్న సమయంలో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. ఆ సమయంలో నోరు మెదపని కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. ప్రతి విషయంలో BJP కి టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. గతంలో జరిగిన రాష్ట్రపతి, ఉఫ రాష్ట్రపతి ఎన్నికలతో పాటు జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాల్లో కూడా టీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ నేతలు కలిసి డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం ముంపునకు గురౌతుందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఈ ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు గేట్లు ఆలస్యంగా ఎత్తడం వల్ల భద్రాచలాన్ని వరద ముంచెత్తిందన్నారు. పోలవరంతో టెంపుల్ సిటీ భద్రాచలం నష్టపోయే అవకాశం ఉందన్నారు.
పోలవరం ప్రాజెక్టు విషయమై తెలంగాణ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ కూడా స్పందించింది. ఏపీకి చెందిన మంత్రి అంబటి రాంబాబు ఈ విషయమై స్పందించారు. పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులున్నాయన్నారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పోలవరం పనులు ప్రారంభమయ్యాయన్నారు. ముంపునకు గురౌతాయనే ఉద్దేశ్యంతోనే ఏడు మండలాలను తెలంగాణలో విలీనం చేసుకున్న విషయాన్ని అంబటి రాంబాబు గుర్తు చేశారు
గోదావరికి భారీగా వరదలు రావడంతో భద్రాచలం వద్ద వరద 70 అడుగులు దాటింది. 1986 తర్వాత ఇంత పెద్ద వరదను చూడలేదని భద్రాచలం వాసులు చెబుతున్నారు. భద్రాచలం పట్టణంలోకి గోదావరి వరద రాకుండా నిర్మించిన కరకట్ట కూడా వరద నీరు రాకుండా అడ్డుకుంది. అయితే కరకట్ట ఎత్తును కూడా పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరకట్టను నిర్మించారు. అయితే ఈ దఫా వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకొని కరకట్ట నిర్మాణాన్ని విస్తరించాలని కోరుతున్నారు. సుభాష్ నగర్ కాలనీ వాసులు తమ వైపునకు కరకట్టను పొడిగించాలని కోరుతున్నారు.
భద్రాచలంలోని ముంపునకు గురయ్యే కాలనీ వాసులకు ప్రత్యేకంగా కాాలనీలను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రెండు రోజుల క్రితం భద్రాచలానికి వచ్చిన కేసీఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. వెయ్యి కోట్లతో ఎత్తైన ప్రాంతాల్లో ముంపు బాధిత ప్రజలకు శాశ్వత కాలనీలను నిర్మించాలని అధికారులను ఆదేశించారు.అయితే భద్రాచలం పట్టణానికి చెందిన కొందరు మాత్రం తమకు ప్రత్యేక కాలనీలు అవసరం లేదంటున్నారు. తమ ప్రాంతానికి వరదనీరు రాకుండా కరకట్ట ఎత్తు పెంచడంతో కరకట్టను విస్తరించాలని కోరుతున్నారు.