Asianet News TeluguAsianet News Telugu

Polavaram Project: అలా అయితే..  ఏపీని తెలంగాణలో కలిపేస్తారా?.. పువ్వాడకు మంత్రి బొత్స స్ట్రాంగ్ రిప్లే

Polavaram Project: పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు

Andhra pradesh Minister Botsa Satyanarayana fire on Telangana Minister Puvvada Ajay Comments On Polavaram Project
Author
Hyderabad, First Published Jul 19, 2022, 3:10 PM IST

Polavaram Project:  మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య మాట‌ల యుద్దం మొదలైంది. పోలవరం ప్రాజెక్ట్ విష‌యంలో ఈ ర‌గ‌డ ప్రారంభ‌మైంది. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు పెంచడం వల్ల తెలంగాణ‌లోని ప‌లు పాంత్రాలకు వరద ముంపు ఉందని.. వెంటనే ఏపీలో విలీనం చేసిన 7 మండలాలు.. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ డిమాండ్ చేయ‌డంతో ఈ అంశం తెరపైకి తీసుకొచ్చారు.

ఈ వ్యాఖ్యలకు ఆంధ్ర‌ప్రదేశ్ మంత్రులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంత్రి పువ్వాడ  వ్యాఖ్య‌ల‌పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్లో  విలీనమైన పోలవరం ముంపు గ్రామాలకు ఏం చేయాలో తమ ప్ర‌భుత్వానికి తెలుసన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ అనవసర విమర్శలు మానుకోవాలని మానుకోవాలని సూచించారు.

ఆ ముంపు గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే..  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను కూడా తెలంగాణలో కలపాలని అడుగుతామన్నారు. స‌మైక్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోవడం వల్ల.. హైదరాబాద్‌ ద్వారా ఏపీకి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని, మ‌రి ఇప్పుడు హైదరాబాద్‌లో కలిపేస్తారా?' అని ప్రశ్నించారు.  

ఏదైనా స‌మ‌స్య ఉంటే.. చర్చించుకోవాలి, కానీ రెచ్చగొట్టే వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌ద‌ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు మంత్రి బోత్స కౌంట‌ర్ వేశారు. ముందుగా తన జిల్లా సంగతి చూసుకోవాలని సూచించారు. వందేళ్ల తర్వాత.. గోదావ‌రికి ఇంత వరద వచ్చిందన్నారు. ఈ విష‌యంలో ఎవరైనా బాధ్యతగా మాట్లాడాలని, విలీన ప్రక్రియ కేంద్రం పరిధిలోని అంశమని అన్నారు.

పోలవరం నిర్మాణంలో ఎలాంటి మార్పులు లేవ‌నీ, గ‌తంలో అమోదించిన‌ డిజైన్ల ప్రకారమే నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ఏమీ చేయలేదని స్ప‌ష్టం చేశారు. గతంలా ఉమ్మడి రాష్ట్రంగా ఉండే బాగుంటుంద‌ని అడిగితే ఎలా ఉంది? ఒకవేళ అలా చేయాల‌ని ఉంటే..  అలానే చేసేయమనండి అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉండ‌టంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. గోదావ‌రి ముంపు మండలాలు ప్రజల బాధ్యతను ఏపీ ప్ర‌భుత్వం చూసుకుంటుంద‌నీ,   విలీన మండలాలను తెలంగాణలో కలిపేయాలని డిమాండ్ చేస్తే.. రాష్ట్రాన్ని మళ్లీ కలిపేయాలని డిమాండ్‌ చేస్తామని మంత్రి బోత్స స‌త్యనారాయ‌ణ కౌంట‌ర్ ఇచ్చారు. 

మంత్రి పువ్వాడ  ఏమన్నారంటే?

ఇటీవ‌ల నిర్వ‌హించిన ఓ మీడియా సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని,  భద్రాచలం ముంపు ప్రాంతానికి శాశ్వత పరిష్కారం దిశగా త్వరలోనే చర్యలు చేపడతామని కీల‌క వ్యాఖ్య‌లు  చేశారు. ఏపీలో క‌లిపిన‌ 7 మండలాలు.. అలాగే.. భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలను మ‌ళ్లీ తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేశారు. ఆ ఐదు గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌కు దూరంగా ఉంటాయని,  ఈ విష‌యంపై కేంద్రం మ‌రోసారి ఆలోచన చేయాలని కోరారు. పార్లమెంట్‌లో ప్ర‌త్యేక బిల్లు పెట్టి ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని.. పోలవరం ఎత్తు తగ్గించాలని చాలా సార్లు కోరామని మంత్రి  పువ్వాడ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios