గాంధీ భవన్ సాక్షిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడిపై దాడికి ప్రయత్నించిన ఏఐసీసీ సభ్యుడు నూతి శ్రీకాంత్‌‌‌కు టిపిసిసి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా శ్రీకాంత్ ను టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌ కోదండరెడ్డి  ఆదేశించారు. లేదంటే పార్టీ కార్యాలయంలో తోటి నాయకుడిపై దురసుగా ప్రవర్తించినందుకు కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. 

ఇటీవల కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా నియమితులైన భట్టి విక్రమార్కకు గాంధీభవన్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన అంబర్‌పేట నియోజకవర్గ సీనియర్‌ నేత వి. హన్మంతరావును శ్రీకాంత్‌ అనుచరులు అడ్డుకున్నారు. శ్రీకాంత్ కు టికెట్ రాకుండా వీహెచ్ అడ్డుకున్నారంటూ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. 

దీంతో వీహెచ్ వర్గీయులు కూడా వారిని అడ్డుకోడానికి ప్రయత్నించారు. ఇలా గాంధీభవన్ సాక్షిగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగి ఒకరిపై ఒకరు కుర్చీలను విసురుకున్నారు. ఈ ఘటనపై వీహెచ్ టిపిసిసి క్రమశిక్షణ కమిటికి ఫిర్యాదు చేశాడు. దీంతో తాజాగా ఈ  గొడవపై వివరణ కోరుతూ క్రమశిక్షణా కమిటి ఏఐసీసీ సభ్యుడు నూతి శ్రీకాంత్‌‌‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.