హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ తో జనం అల్లాడుతుంటే ఇంత ఆఘమేఘాల మీద పాత సచివాలయం కూల్చివేత అవసరమా? అని  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజల బాధలకంటే తన మొండి పట్టుదలనే ప్రాధాన్యతగా ఉంది అని మండిపడ్డారు. 

''కరోనా విజృంభణ, లాక్ డౌన్ కారణంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. అలాగే  రైతులకు రుణ మాఫీ డబ్బులు లేవు. ఇలాంటి సంక్షోభ సమయంలో కొత్త సచివాలయం అవసరమా?'' అని ప్రశ్నించారు. 

read more   తెలంగాణ నూతన సచివాలయం... ఎలా వుండనుందంటే

''తెలంగాణలో ఇంతటి దుర్భర పరిస్థితులుంటే ముఖ్యమంత్రి కనీసం వైద్యం పైన సమీక్ష కూడా చేయకుండా ఎక్కడ చీకటిలో ఉన్నారు.  ముఖ్యమంత్రి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రజలు గమనించాలి. దీనిపై ప్రజలే ప్రశ్నించాలి'' అని సూచించారు.  

''మేము పాత సచివాలయంలో కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేయమని కొరాం. అలా చేస్తే 10 వేల మంది రోగులకు సౌకర్యంగా ఉండేది. కానీ సీఎం తన మొండి వైఖరితో జనం ప్రాణాలు తీస్తున్నారు'' అని అన్నారు. 

''మొదటినుంచి సీఎం కరోనా విషయంలో తప్పుడు విధానాలతోనే పోతున్నారు. అందుకే నేడు రాష్ట్రం ఇంతటి దుర్భర పరిస్థితి ఎదుర్కొంటుంది.  ఇప్పటికైనా కేసీఆర్ ప్రజా సంక్షేమం పైన దృష్టి సారించాలి'' అని ఉత్తమ్ సూచించారు.