హైదరాబాద్: తెలంగాణ  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన నూతన సచివాలయ బిల్డింగ్ డిజైన్ ఖరారయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేత ఆమోదించబడిన నూతన భవన నమూనా చిత్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. కొత్త హంగులతో నిజాం కాలం నాటి నిర్మాణాల శైలిలోనే తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం కానుంది. 

ప్రస్తుతం పాత సచివాలయ భవనాల కూల్చివేత కొనసాగుతోంది. శ్రావణమాసంలో సమీకృత కొత్త సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఏడాదిలోగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. కాబట్టి శ్రావణమాసం నుండి నిరంతరాయంగా పనులు సాగుతాయని తెలుస్తోంది.  

తెలంగాణ హైకోర్టు స్పష్టతనిచ్చిన నేపథ్యంలో పాత సచివాలయ భవనాల కూల్చివేత పనులు మంగళవారం మొదలయ్యాయి.  అధికారులు పనులు మెుదలుపెట్టారు. తెల్లవారుజాము నుంచి సచివాలయం భవనాల కూల్చివేత పనులు చకాచకా సాగుతున్నాయి. 

భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య సచివాలయం భవనాల కూల్చివేత పనులు నడుస్తున్నాయి. ఆటు వైపు వెళ్లే మార్గాలన్నీ పోలీసులు మూసివేశారు. వాహనాలతో సహా ఎవరినీ అధికారులు అనుమతించట్లేదు. కూల్చివేత పనులను ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

 బీఆర్కేఆర్ భవనంలోని అన్ని కార్యాలయాలకు ఇవాళ సెలవు ప్రకటించిన ప్రభుత్వం. అన్ని శాఖలకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సచివాలయం వైపు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసేశారు. పోలీసులు అటువైపు వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నారు.