ఇండియా టుడే ఎగ్జిట్ ఫోల్ సర్వే టీఆర్ఎస్ కు అత్యధిక స్థానాలు వస్తాయని తేల్చిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ 79 -91, ప్రజాకూటమి 21-33, బీజేపీ 1-3, ఎంఐఎం47 స్థానాల్లో గెలిచే  అవకాశం ఉందని ఆ సర్వే తేల్చింది.  అయితే అదే సంస్థకు చెందిన రాజ్ దీప్ తమ సర్వేలను చూసి కంగారు పడొద్దని తనకు ఫోన్ చేసి మరీ చెప్పారని ఉత్తమ్ సంచలన ప్రకటన చేశారు. టీఆర్ఎస్ కు అత్యధిక స్థానాలు వస్తాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే. 

మేము చెప్పినట్లు ఫలితాలుండవని రాజ్ దీప్ తనతో ఫోన్ లో స్వయంగా చెప్పారని టిపిసిసి చీఫ్ ఉత్తమ్ వెల్లడించారు. ఈ సర్వే ఫలితాలు చూసి కంగారు పడొద్దని ఆయన చెప్పారని ఉత్తమ్ పేర్కొన్నారు. మేము కేవలం ఓ అంచనా ప్రకారమే ఈ సర్వే ను చేసినట్లు రాజ్ దీప్ తనతో చెప్పినట్లు ఉత్తమ్ బయటపెట్టారు. 

ఎన్నికలు ముగిశాయి కాబట్టి మహా కూటమి శ్రేణులు ఈవీఎంల భద్రతపై దృష్టి పెట్టాలని ఉత్తమ్ సూచించారు. వాటిని భద్రపరిచే స్ట్రాంగ్ రూంలోకి ఎవ్వరినీ  పోనివ్వరాదని... అధికారులకు కూడా అందులోకి ప్రవేశించే హక్కు లేదన్నారు. ఫలితాలు వెలవడే వారికి వాటిలో అవకతవకలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని ఉత్తమ్ అన్నారు. 

తెలంగాణలో నిర్వహించిన ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం చాలా పొరపాట్లు చేసిందని ఉత్తమ్ ఆరోపించారు. భారీ సంఖ్యలో ఓట్లు గల్లంతవడానికి కారణం ఈసీ నిర్లక్ష్యమేనన్నారు. ఎన్నికలకు సిద్దంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘానికి చెప్పి... చివరకు ఎన్నికలు నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విఫలమైందని  ఉత్తమ్ ఆరోపించారు. 

ప్రజల్లో ప్రజా కూటమిపై సానుకూల స్పందన ఉందని...అందువల్లే ఎన్నికల్లో భారీ ఓటింగ్ నమొదయ్యిందన్నారు. కొన్ని జాతీయ చానళ్లు బిజెపి పక్షపాతంతో పనిచేస్తాయి. కాబట్టి అదే వారి సర్వే పలితాల్లో కనిపించిందని ఉత్తమ్ పేర్కొన్నారు. తానిక గడ్డం తీసేసే సమయం వచ్చిందని ఉత్తమ్ తెలిపారు. ఎన్నికల్లో భారీగా పాల్గొన్న ఓటర్లకు ఉత్తమ్ కృతజ్ఞతలు తెలిపారు.