Asianet News TeluguAsianet News Telugu

బ్రాహ్మణులతో మీటింగ్‌లు... వామన్‌రావు హత్యను వాళ్లు మరిచిపోలేదు : కేటీఆర్‌కు ఉత్తమ్ చురకలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కల్వకుంట్ల కుటుంబం ఏడేండ్ల పాటు తెలంగాణని అన్ని విధాలుగా, అభాసుపాలు చేసి అప్పుల్లో ముంచి దోచుకుందని ఆరోపించారు. 

tpcc chief uttam kumar reddy slams minister ktr over mlc elections ksp
Author
Hyderabad, First Published Mar 8, 2021, 2:52 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. గాంధీభవన్‌లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కల్వకుంట్ల కుటుంబం ఏడేండ్ల పాటు తెలంగాణని అన్ని విధాలుగా, అభాసుపాలు చేసి అప్పుల్లో ముంచి దోచుకుందని ఆరోపించారు.

టీఆర్ఎస్- బీజేపీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాకివ్వాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. ఏడేళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఎందుకు రాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.

ఫిట్‌మెంట్ అలవెన్స్ 7.5 శాతం పీఆర్‌సీ కమిటీ సిఫారసు చేస్తే రెండు నెలల్లో సీఎం స్పందించలేదని ఆయన నిలదీశారు. పీఆర్‌సీ హౌస్ రెంట్ అలవెన్స్ తగ్గించమని చెబితే... ఎందుకు కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాలేదని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు.

నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, డాక్టర్లు, పెన్షనర్లకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు మీ ఆత్మగౌరవానికి సంబంధించినవని ఆయన తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మంత్రులు, పార్టీ పెద్దలు ఏ విధంగా సమస్యలు పరిష్కరించారో గుర్తుచేసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

చిన్నారెడ్డి, రాములు నాయక్‌లు పట్టభద్రుల తరపున పోరాడతారని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. మంథనిలో హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతులు దళితుల పక్షాన పిటిషన్ వేశారని తెలిపారు.

టీఆర్ఎస్ నాయకులు ఇసుక మాఫియాతో పాటు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో వామన్‌రావు దంపతులు కేసులు వేశారని ఉత్తమ్ వెల్లడించారు. దీనిపై కక్షగట్టి వీరిద్దరిని మిట్ట మధ్యాహ్నం నడిరోడ్డుపై కిరాతకంగా నరికి చంపారని ఉత్తమ్ ఆరోపించారు.

ఈ ఘటనను బ్రాహ్మణ సమాజం మరిచిపోదని ఆయన తేల్చిచెప్పారు. ఏరు దాటాకా తెప్ప తగలబెట్టడంలో కల్వకుంట్ల కుటుంబసభ్యులు నేర్పరులంటూ ఉత్తమ్ సెటైర్లు వేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల్ని టీఆర్ఎస్ ప్రభుత్వం పీడించినట్లుగా ఎవరూ పీడించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios