ఆదివారం హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొంగర కలాన్ లో జరుగుతున్న ఈ సభ కోసం టీఆర్ఎస్ పార్టీ భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేవలం సభకోసమే రూ.300 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపించారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతిపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విచారణ చేపట్టనున్నట్లు ఉత్తమ్ తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీ చేపడుతోంది ప్రగతి నివేదన సభ కాదని ప్రగతి ఆవేదన సభ అని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. సభ పేరుతో టీఆర్ఎస్ తమ దగ్గరున్న ధనాన్ని ప్రజల్లో ప్రదర్శిస్తోందన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోడానికి కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉన్నట్లు ఉత్తమ్ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలొచ్చినా, సాధారణ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ లో అధికారాన్ని చేజిక్కించుకుని ఈ టీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ చేయించనున్నట్లు తెలిపారు.