తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాంను టీఆర్ఎస్ ఏజెంట్ గా అభివర్ణించిన పార్టీ, జేఏసీ నుంచి వైదొలిగిన పార్టీ ఇప్పుడు అదే జేఏసీ మరింత బలోపేతం కావాలని కోరుతుండటం, దానికి తమ మద్దతు ఉంటుందని చెబుతుండటం గమనార్హం.
రాజకీయాలు అన్నాక కొత్త పార్టీలు వస్తూ ఉంటాయి. అవసరం తీరాక కొన్ని పార్టీలు కాలగర్భంలో కలసిపోతుంటాయి.తెలుగునాట కూడా ఇలాంటి సోమవారం మొదలెట్టి మంగళవారం జెండా ఎత్తే పార్టీలు చాలానే చూశాం. అయితే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలో ఒకరు, ప్రస్తుత తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాత్రం ఈ కొత్త పార్టీల అంటే ఇప్పుడు హడలిపోతున్నారు.
తెలంగాణ ఇచ్చినా ఆ క్రెడిట్ కాంగ్రెస్ కు దక్కకుండాపోయింది, మరోవైపు కేసీఆర్ చరిష్మా రోజురోజుకు పెరిగిపోతుంది. ఇది చాలదన్నట్లు స్వపక్షంలోనే ఆయనకు బోలడంతమంది విపక్షంగా ఉన్నారు. ఎవరు ఎప్పుడు తన పదవికి ఎసరు పెడుతారో ఆయనకే తెలియదు. అందుకే స్వపక్షంలో శత్రువులను శాంతింప చేయడానికే ఆయన సగం సమయం సరిపోతుంది. దీంతో కేసీఆర్ ను ఢీ కొట్టే కాంగ్రెస్ నేత లేకుండా పోయారు.
ఈ టైంలో ఢిల్లీలో కేజ్రీవాల్ ఆప్ పార్టీతో అధికారంలోకి వచ్చిన్నట్లు ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి వస్తుందేమోనని తెగ భయపడిపోతున్నారు.
ఇటీవల ఆప్ మాజీ నేత, సోషల్ వర్కర్ యోగేంద్రయాదవ్ హైదరాబాద్ లో ప్రసంగిస్తూ ఇక్కడ కూడా ఉద్యమ నేతల నుంచి పార్టీ రావాలని సూచించారు. ఆ సమావేశంలో తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం కూడా ఉన్నారు.
యోగేంద్రయాదవ్ మాటలు నిజమై ఇక్కడ కూడా ఉద్యమ నేతలు పార్టీ పెడితే... తమ పరిస్థితి ఏంటీ అని ఉత్తమ్ కలవరపడుతున్నట్లు ఉంది. అధికారంలో ఉన్న గులాభీ నేతలకు లేని భయం కాంగ్రెస్ నేతలకు ఉండటమే ఈ విషయంలో అసలు ట్విస్ట్.
ప్రతిపక్షంగా కూడా సరిగా పనిచేయడం లేదన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొత్త పార్టీ పెడితే తమ పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందని వారి ఆందోళన. అందుకే కొత్త పార్టీ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి హడలిపోతున్నారు. దీంతో ముందస్తు చర్యగా జేఏసీని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.
జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం కొత్త పార్టీ పెట్టరని మీడియా ముఖంగా ప్రకటించేశారు. కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వారే కోదండరాంను పార్టీ పెట్టమంటున్నారని చెప్పారు.
రాష్ట్రంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసేవారికి అండగా ఉంటామని పరోక్షంగా టీ జేఏసీ కి మద్దతిస్తామని తెలిపారు. అంతేకాదు... తెలంగాణ రాజకీయ జేఏసీ ఇంకా బలోపేతం కావాలని, దానికి తమ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పొకొచ్చారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాంను టీఆర్ఎస్ ఏజెంట్ గా అభివర్ణించిన పార్టీ, జేఏసీ నుంచి వైదొలిగిన పార్టీ ఇప్పుడు అదే జేఏసీ మరింత బలోపేతం కావాలని కోరుతుండటం, దానికి తమ మద్దతు ఉంటుందని చెబుతుండటం గమనార్హం.
