తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య అభిప్రాయ బేధాలు సాధారణమే అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ జరుగుతోందని.. త్వరలోనే మార్పు ఉంటుందన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య అభిప్రాయ బేధాలు సాధారణమే అన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ జరుగుతోందని.. త్వరలోనే మార్పు ఉంటుందన్నారు. భట్టితో మాట్లాడినప్పుడు ఈటలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించామని.. అయితే కేంద్రం రక్షణ కోసమే ఈటల బీజేపీలోకి వెళ్తున్నారని అన్నారు. టీపీసీసీ చీఫ్ విషయంలో అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. ఎవరు అధికారంలో వుంటే.. అటువైపు పోవడం నాయకులకు అలవాటైందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణలో ఇంత గలీజు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని ఆయన వ్యాఖ్యానించారు. సాగర్ ప్రచారంలో ప్రభుత్వం అందరినీ దించినా.. తాము 5 శాతం తేడాతోనే ఓడిపోయామని ఉత్తమ్ తెలిపారు. ఎన్నికలు, ఉప ఎన్నికల్లో తమకు కాలం కలిసి రాలేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడ వుంది.. సాగర్‌లో వారికి ఎన్ని ఓట్లు వచ్చాయని ఉత్తమ్ ప్రశ్నించారు. లెఫ్ట్ భావజాలాలు వున్న ఈటల.. బీజేపీలోకి ఎందుకు వెళ్తున్నారో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. 

Also Read:హుజూరాబాద్‌లో కీలక పరిణామం: ఈటల దళిత బాధితుల సమావేశం, జీపు యాత్రకు నిర్ణయం

మరోవైపు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల 11వ తేదీ తర్వాత బీజేపీలో చేరనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు రేపు ఆయన అందించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో చేరనున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నకల్లో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి ఆయన పోటీ చేసి విజయం సాధించారు. ఈ స్థానం నుండి వరుసగా ఆయన టీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాఢించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014, 2018లలో కేసీఆర్ మంత్రివర్గంలో ఈటల రాజేందర్ కు చోటు దక్కింది. భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో రాజేందర్ ను మంత్రివర్గం నుండి కేసీఆర్ భర్తరఫ్ చేశారు.