నాగార్జున సాగర్: దేశానికి, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరం ఉందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అందువల్ల రాహుల్ గాంధీ రాజీనామాను ఉపసంహరించుకోవాలని కోరారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ అంశంపై ఏకవ్యాఖ్య తీర్మానం చేశామని తెలిపారు. దాన్ని సీడబ్ల్యూసీకి పంపించనున్నట్లు తెలిపారు. 
 
సీఎల్పీ విలీనంపై ఎలాంటి చర్చ జరగలేదని అది కోర్టు పరిధిలో ఉందన్నారు. కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సీఎల్పీ విలీనం అసంబంద్ధం అంటూ చెప్పుకొచ్చారు.

మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ గా చర్చ జరిగినట్లు తెలిపారు. ఎలక్షన్లో టికెట్లు, బీ ఫామ్ లు ఎవరు ఇవ్వాలో అనే అంశంపై కూడా చర్చించినట్లు తెలిపారు. పోటీ చేసిన ఎంపీ ఓడినా గెలిచినా, ఆ మున్సిపాలిటీకి చెందిన ఆఫీస్ బేరర్ రాష్ట్ర కమిటీకి సిఫారసు చేస్తారని ఆ విధంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. 

ఇకపోతే రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డిల బృందం సోమవారం మధ్యాహ్నాం సచివాలయం, అసెంబ్లీ భవనాలను పరిశీలించనుందని తెలిపారు. అసెంబ్లీ భవనాలకు సంబంధించి శిలా ఫలకాలు, ఏర్పాట్లుపై పరిశీలన చేయనుందని స్పష్టం చేశారు. 

మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతిని బయటపెడతామని తెలిపారు. ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించడం లేదని అయితే వీ డిజైన్ మార్చడం, టెండ్ల అంచనాలను భారీగా పెంచడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును కూడా త్వరలో పరిశీలిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు సీనియర్ నేతలతోపాటు, ఇరిగేషన్ లో ప్రావీణ్యం కలిగిన నలుగురు ఎక్స్ పెర్ట్ లతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఒక నివేదికనను రూపొందించనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.