అర్హులైన ఒక శాతం మంది పేదలకు ఇళ్లు మంజూరు చేస్తే గ్రేటర్ ఎన్నికల నుంచి కాంగ్రెస్ తప్పుకుంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామని ఆయన తెలిపారు.

ఆదివారం హైదరాబాద్ ఇందిరా భవన్‌లో జరిగిన సిటీ కాంగ్రెస్ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ల విభజన హేతుబద్ధంగా ఉండాలని.. అన్ని డివిజన్లలో ఓటర్లు సమానంగా ఉండాలని ఉత్తమ్ తెలిపారు.

అదే విధంగా సచివాలయంలో ఆలయం, మసీదు కూల్చివేతపై న్యాయపోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపాలిటీల్లో ఆగస్టు 24 వరకు పార్టీ కమిటీలు కూడా పూర్తి చేయాలని ఉత్తమ్ పేర్కొన్నారు.

Also Read:ఏపీకి రాజధాని లేదు.. తెలంగాణకు సచివాలయం లేదు: రేవంత్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ మెట్రోను  నాటి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తీసుకొచ్చారని.. మూసీ ప్రక్షాళన ఆరేళ్లుగా కొనసాగిస్తూనే ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఉస్మానియా ఆసుపత్రికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఉత్తమ్ ఆరోపించారు.

తాను మంత్రిగా దిగిపోయే ముందు రూ.200 కోట్లు మంజూరు చేస్తే ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదన్నారు. ఉస్మానియా విషయాన్ని ఇంటింటికీ తీసుకెళ్తామని.. సచివాలయం కూల్చివేత బాధ కలిగించిందని, ప్రజల సొమ్మును వృధా చేస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు.

కారు స్టీరింగ్ తమ చేతుల్లో ఉన్న ఎంఐఎం బ్రదర్స్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. మసీదు, మందిర్ కూల్చివేతపై ఈ నెల 22న కాంగ్రెస్ పార్టీ జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని ఉత్తమ్ స్పష్టం చేశారు. బస్తీ దవాఖానాలు కేటీఆర్‌కు ఇప్పుడు గుర్తుకొచ్చాయా అని ఆయన ఎద్దేవా చేశారు.