టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి రాజధాని లేనట్టే తెలంగాణకు సచివాలయం లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ హిందూత్వ ఎజెండాతో నడిస్తే.. తెలంగాణలో కేసీఆర్ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చారని రేవంత్ రెడ్డి అన్నారు.

గతంలో రాజులు, రాజ్యాలపై గెలిచిన తర్వాత పాత వాటిని ధ్వంసం చేసేవారని.. అదే బాటలో కేసీఆర్ సైతం పయనిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిలో భాగంగానే నిజాం, కుతుబ్‌షాహీల కాలం నాటి జ్ఞాపకాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు.

ఉస్మానియాను కూల్చడం, యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం, కొత్త సచివాలయం కూడా ఇందులో భాగమేనని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కూలీ కుతుబ్ షాహి కాలంలో నిర్మించిన మసీదు, పోచమ్మ దేవాలయాలు కూల్చేశారని ఆయన ఆరోపించారు.

సచివాయలంలో దేవాలయం, మసీదు కూల్చివేత నేపథ్యంలో ప్రభుత్వంపై క్రిమినల్ కేసు నమోదయ్యేలా ఉత్తమ్, భట్టి బాధ్యత తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీకి రాజధాని లేనట్లే .. తెలంగాణకు సచివాలయం లేకుండా పోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ కనుసన్నల్లోనే  ఎంఐఏం నడుస్తోందని.. దేవాలయాల కూల్చివేతపై మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డిలకు మాట్లాడే అర్హత లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో సీరియస్‌గా పనిచేయాలని, మీటింగ్‌లకే పరిమితమైతే లాభం లేదని ఆయన అన్నారు.