టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. అందుకు ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి.
తెలంగాణ కాంగ్రెస్ విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశం అనంతరం.. కొద్ది రోజుల పాటు టీ కాంగ్రెస్ నాయకులు ఏకతాటిపైకి వచ్చినట్టుగా కనిపించారు. అయితే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా.. అందుకు ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పార్టీలో అంతర్గతంగా విబేధాలు కొనసాగుతున్న విషయం బయటకు వచ్చింది. రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనకు ముందుకు ఇలాంటి పరిణామాలు పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
వివరాలు.. వరంగల్‌లో మే 6న నిర్వహించే రైతు సంఘర్షణ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాలో సన్నాహాక సమావేశాలను నిర్వహించారు. ఈ నెల 27న నల్గొండ జిల్లాల్లో పర్యటించాల్సి ఉండగా.. ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రేవంత్ పర్యటన వాయిదా పడింది. ఈ క్రమంలోనే సీనియర్ నేత, మాజీ మంత్రి జనారెడ్డి జోక్యం చేసుకున్నారు. పలువురు సీనియర్ నేతలతో చర్చించి.. రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్‌లో సన్నాహక సమావేశాన్ని ఖరారయ్యేలా చేశారు. ఇందుకు సంబంధించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కూడా జానారెడ్డి మాట్లాడినట్టుగా తెలుస్తోంది.
ఇక, గత కొన్ని రోజులుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్గ విభేదాలు కొనసాగుతున్నాయి. రేవంత్ రెడ్డి పర్యటనకు ఎంపీలు ఉత్తమ్, కోమటిరెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేయడంపై ఆయన వర్గం నేతలు మండిపడ్డారు. ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా ఆయా నియోజకవర్గాల్లోని అసమ్మతి నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉత్తమ్, కోమటిరెడ్డిల వైఖరిపై చర్చించారు.
ఇక, జానారెడ్డి జోక్యంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది. దీంతో రేపు నాగార్జున సాగర్‌లో రేవంత్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. మరి ఈ సమావేశానికి ఉత్తమ్, కోమటిరెడ్డిలు హాజరువుతారా..? లేదా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాగార్జునసాగర్‌లోని విజయ్‌విహార్‌లో జరిగే ఈ సమావేశానికి నల్గొండ, భువనగిరి ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో పాటూ మాజీ మంత్రులు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి ఇతర ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు ఆహ్వానించామని, వారంతా హాజరవుతారని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ తెలిపారు.
