ధరల పెంపునకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్‌లపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. కేంద్రంలో ఆయన పెంచితే.. రాష్ట్రంలో ఈయన పెంచుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని పేద, మధ్య తరగతి ప్రజలను దోచుకునే విధంగా ధరలు పెంచాయంటూ మండిపడ్డారు టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy). శనివారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. అసలే కరోనా దెబ్బ నుంచి కోలుకోకముందే, ఆదాయం పడిపోయి, కుటుంబాలను పోషించడమే కష్టంగా పరిస్ధితులు మారిపోయాయని రేవంత్ చెప్పారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఉదారంగా ముందుకు వచ్చి వస్తువుల ధరలు , పన్నులు తగ్గించాల్సింది పోయి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. 

సహయం అందించకపోగా.. వారి జేబులకు చిల్లు పెట్టి, సంపాదించిన సంపదనంతా, జేబు దొంగల్లాగా దోచుకుంటున్నారని రేవంత్ ఫైరయ్యారు. ఒక పక్క మోడీ (narendra modi), మరో పక్క కేసీఆర్ (kcr) ఈ దోపిడికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ ఛార్జీలను (electricity charges in telangana) పెంచడం ద్వారా రూ.5,596 కోట్లను పేదల నుంచి గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. సర్ ఛార్జీలు, ఇతరత్రా పేరిట మరో 6 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం గుంజుకోవాలని ప్రయత్నిస్తోందని ఆయన మండిపడ్డారు. 

ఈఆర్‌సీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో తానే స్వయంగా వెళ్లి.. ఈఆర్‌సీ ఛైర్మన్ రంగారావు ముందు పేదల గురించి వాదించినట్లు ఆయన తెలిపారు. విద్యుత్ సరఫరా సంస్థలు ఆర్ధిక సంక్షోభంలో వున్నాయని... అందువల్ల ఛార్జీలను పెంచాలని ఈఆర్‌సీ ఎదుట పెట్టిన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. విద్యుత్ సంస్థలు ఆర్ధిక సంక్షోభాలను ఎదుర్కోవడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమని రేవంత్ దుయ్యబట్టారు. 

ఎన్నికల సందర్భంగా అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ పార్టీ .. రైతులకు వ్యవసాయ విద్యుత్ ఉచితమని, లిఫ్టుల నిర్వహణ విద్యుత్ ఉచితమని, అదేవిధంగా పేదలు నిర్వహిస్తున్న కొన్ని వ్యాపార సంస్థలకు ఉచితమని చెప్పిందంటూ రేవంత్ దుయ్యబట్టారు. దీని కారణంగా 12 వేల కోట్లకు పైగా అప్పులు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు చెల్లించలేదన్నారు. 2016-17లో విద్యుత్ ఛార్జీలు పెంచిన తర్వాత ఐదేళ్లు ఛార్జీలు పెంచలేదని చెబుతున్నారని రేవంత్ ఫైరయ్యారు. 

విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ మండల కేంద్రాల్లో ఆందోళనలు చేస్తామని తెలిపారు. అలాగే ఏప్రిల్ 4న మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు జరుపుతామన్నారు. అంబేద్కర్ విగ్రహాల ముందు కేసీఆర్, మోడీల దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తామన్నారు. ఏప్రిల్ 5న కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలుపుతామని.. ఏప్రిల్ 7న హైదరాబాద్ విద్యుత్ సౌద ముట్టడిస్తామని రేవంత్ చెప్పారు. నూకలు ఎక్కువ వస్తే.. పౌల్ట్రీకి అమ్మవచ్చని సూచించారు. రాష్ట్రంపై భారం పడేది కేవలం రూ.2 వేల కోట్లేనని రేవంత్ అన్నారు. రైతులకు కష్టం వస్తే వదిలే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.