Asianet News TeluguAsianet News Telugu

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచే పోటీ.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కొడంగల్ (kodangal) నుంచే మళ్లీ పోటీ చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. 2009లో కొడంగల్‌కు తాను కొత్త అయినా గెలిపించారని.. కొడంగల్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని రేవంత్ వ్యాఖ్యానించారు. 

tpcc chief revanth reddy sensational comments on contesting in 2023 telangana elections
Author
Hyderabad, First Published Jan 25, 2022, 7:42 PM IST

టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కొడంగల్ (kodangal) నుంచే మళ్లీ పోటీ చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. 2009లో కొడంగల్‌కు తాను కొత్త అయినా గెలిపించారని.. కొడంగల్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని రేవంత్ వ్యాఖ్యానించారు. కాగా... వరుసగా రెండుసార్లు కొడంగల్ నుంచి తెలుగుదేశం పార్టీ (telugu desam party) నుంచి గెలిచారు రేవంత్ రెడ్డి. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ (congress) టికెట్‌పై పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నిరాశకు లోనుకాకుండా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి (malkajgiri) పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం ఎంపీగా, టీపీసీసీ చీఫ్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో తాను పోటీ చేసే స్థానంపై రేవంత్ రెడ్డి అప్పుడే క్లారిటీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు (kcr) రేవంత్‌ రెడ్డి గత శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో అకాల, భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారంగా చెల్లించాలని కోరారు. మిగతా పంటలకు ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలని .. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేయాలని రేవంత్ రెడ్డి  డిమాండ్ చేశారు. రాష్ట్రంలో తామర తెగులు, భారీ వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మిర్చి పంట (mirchi crop) మంచిగా పడితే ఎకరాకు 3.50 లక్షల ఆదాయం వస్తోందని ఆశపడి ఎకరాకు లక్షన్నర పెట్టుబడిని పెట్టారని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కానీ తామర తెగులుతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని టీపీసీసీ చీఫ్ తెలిపారు. ముఖ్యమంత్రి.. జిల్లాల్లో పర్యటిస్తామని చెప్పి తర్వాత తప్పించుకొని మంత్రులను, అధికారులను పంపించారని రేవంత్ ఆరోపించారు. రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల్లో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయి దాదాపు 8.633 కోట్ల నష్టం వచ్చిందని ఆయన తెలిపారు. కేంద్రం ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులను ఏమి చేశారో రైతులకు చెప్పాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వెంటనే రైతులను ఆదుకోకపోతే కాంగ్రెస్‌ పార్టీ తరపున రైతుల కోసం ప్రత్యక్ష కార్యాచరణను చేపడతామని వెల్లడించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios