తన బంధువులు, సన్నిహితులకు సీఎం కేసీఆర్ అక్రమంగా ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. లక్ష కోట్ల అవినీతి సొమ్ముతో కేసీఆర్ దేశ రాజకీయాలను శాసించాలని అనుకుంటున్నారని ఆయన చెప్పారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తన బంధువులు, సన్నిహితులకు సీఎం కేసీఆర్ అక్రమంగా ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారని రేవంత్ ఆరోపించారు. ముఖ్యమంత్రి విధానాలు అత్యంత ప్రమాదకరమని ఆయన దుయ్యబట్టారు. జీనోమ్ వ్యాలీలో అలెగ్జాండ్రియా ఫార్మాకు కేటాయించిన భూములపై సీఎం కుటుంబ సభ్యుల కన్నుపడిందన్నారు. యశోదా ఆసుపత్రికి భూములిచ్చేందుకు సదరు కంపెనీపై కేసీఆర్ బంధువులు ఒత్తిడి తీసుకొచ్చారని రేవంత్ ఆరోపించారు.

కల్వకుంట్ల జగన్నాథరావు, రవీంద్రరావు, దేవేంద్ర రావులు కలిసి అలెగ్జాండ్రియా ఫార్మా కంపెనీకి కేటాయించిన భూములను కొట్టేయాలని అనుకున్నారని ఆయన తెలిపారు. హైకోర్టులో వారికి అనుకూలంగా తీర్పు వచ్చినా.. కేసీఆర్ ప్రభుత్వం దానిని సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. మొత్తం రూ.800 కోట్ల విలువైన భూమిని వారంతా కలిసి కొట్టేశారని రేవంత్ ఆరోపించారు. 

ALso Read: హెటిరో పార్ధసారథి సంస్థకు అతి తక్కువకే భూమి లీజు: రేవంత్ సంచలనం

లక్ష కోట్ల అవినీతి సొమ్ముతో కేసీఆర్ దేశ రాజకీయాలను శాసించాలని అనుకుంటున్నారని రేవంత్ ఆరోపించారు. రబ్బరు చెప్పులతో తిరిగి, అటుకులు బొక్కిన కేసీఆర్‌కు ఈ నాడు వేల కోట్ల ఆస్తులు, ఫాంహౌస్‌లు, పేపర్, టీవీ ఛానెల్ ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిపై రోజుకొక విషయం బయటపెడతానని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్ధసారథి రెడ్డికి భూములు కట్టబెట్టింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. తాను తప్పుడు ఆరోపణలు చేస్తే శిక్ష వేయాలని రేవంత్ సవాల్ చేశారు. 

అంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇక్కడ అమ్మకానికి పెట్టి.. స్టీల్ ప్లాంట్ కొంటావా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ పెట్టే శక్తి వుంటే బయ్యారంలో పెట్టాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. విశాఖ వద్దు బయ్యారం ముద్దు అన్నదే తమ నినాదమని ఆయన స్పష్టం చేశారు. సమస్యలను పక్కదోవ పట్టించడం కోసమే కేసీఆర్ ఇదంతా చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఓడిపోతామనే భయంతోనే సింగరేణిలో ఎన్నికలు నిర్వహించడం లేదని.. సింగరేణి గనులను ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణిలో ఎంతోమంది కార్మికుల ఉద్యోగాలు పోతున్నాయని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. ప్రాణహిత ప్రాణం తీశారని.. ఇక్కడి ఇసుకను ప్రభుత్వంలోని కొందరు పెద్దలు దోపిడీ చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపించారు.