హైదరాబాద్ ఉమ్మడి రాజధాని .. ఇక్కడ ధర్నాలు చేయొద్దంటే ఎలా : చంద్రబాబు అరెస్ట్‌పై రేవంత్ వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అని , అలాంటిది ఏపీకి చెందిన అంశంపై ఇక్కడ నిరసన జరపొద్దు అంటూ ఎలా అని ప్రశ్నించారు. చింతమడకకు చెందిన కేటీఆర్‌కు హైదరాబాద్‌లో పనేంటి అని ఆయన ప్రశ్నించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బుధవారం రేవంత్ గాంధీ భవన్‌లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అని , అలాంటిది ఏపీకి చెందిన అంశంపై ఇక్కడ నిరసన జరపొద్దు అంటూ ఎలా అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌పై నిరసనలు చేస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు విధించడం, ఆందోళన చేయొద్దని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు.
ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేం వుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి ఏపీ వాళ్ల ఓట్లు కావాలి.. వాళ్లకు కష్టం వస్తే మాత్రం రెండు పార్టీల మధ్య సమస్య అంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ ఏపీ రాజకీయాలకే పరిమితమైంది కాదని.. దేశ రాజకీయాలకు సంబంధించిన అంశమని రేవంత్ పేర్కొన్నారు. చింతమడకకు చెందిన కేటీఆర్‌కు హైదరాబాద్‌లో పనేంటి అని ఆయన ప్రశ్నించారు.
ALso Read: ఏపీ రాజకీయాలతో తెలంగాణకు ఏం సంబంధం?: చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్
తెలంగాణ ఉద్యమ సమయంలో వైట్ హౌస్ ముందు ధర్నా చేశామని కేటీఆర్ చెప్పారని.. మరి ఐటీ కారిడార్‌లో చంద్రబాబు కోసం ఆందోళన చేస్తే తప్పేముందని రేవంత్ రెడ్డి నిలదీశారు. వాళ్ల పార్టీ పేరు కేటీఆర్‌కు క్లారిటీ వుండటం లేదని.. ఒకసారి టీఆర్ఎస్ అని, మరోసారి బీఆర్ఎస్ అని అంటున్నారని రేవంత్ చురకలంటించారు.
బీసీలకు బీఆర్ఎస్ ఇచ్చిన సీట్ల కంటే ఎక్కువే ఇస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రేపు కాంగ్రెస్‌లో చేరుతారని.. ఆయన కుటుంబానికి రెండు టికెట్లు ఖరారు చేశామని రేవంత్ చెప్పారు. విడతల వారీగా అభ్యర్ధుల ప్రకటన వుంటుందని, స్క్రీనింగ్ కమిటీ నివేదికను సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్ లేని చోట బీజేపీకి ఓటు వేయాలని అసదుద్దీన్ చెబుతున్నారని రేవంత్ దుయ్యబట్టారు.
కేసీఆర్‌పై నమ్మకం లేకనే కవిత కోర్ట్ కు వెళ్లిందని, న్యాయస్థానం జోక్యం చేసుకోవడం వల్లే ఆమె అరెస్ట్ ఆగిపోయిందన్నారు. పార్టీలో చేరడానికి అందరికీ ఆహ్వానమేనని.. టిక్కెట్ స్థానిక పరిస్థితులను బట్టి పార్టీ సమిష్టి నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ స్పష్టం చేశారు. మా సర్వేలలో బీఆర్ఎస్ 25 సీట్లు దాటదని.. బీజేపీ, ఎంఐఎంలు సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతాయని ఆయన పేర్కొన్నారు.