కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పథకాలపై చర్చకు తాము సిద్దంగా ఉన్నామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏ అంశంపై చర్చకు వస్తారో కేటీఆర్ చెప్పాలని రేవంత్ రెడ్డి కోరారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయంలో ఏ కార్యక్రమాలు చేపట్టామో చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని టీపీసీసీ చీఫ్ Revanth Reddy చెప్పారు.ఏ విషయమై చర్చకు వస్తారో చెప్పాలని TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. 

TPCCచీఫ్ రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ విమర్శలు చేయడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు విషయమై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ పై కేటీఆర్ విమర్శలు చేయడంపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

అమెరికాలో విహార యాత్రకు వెళ్లి వచ్చిన కేటీఆర్ తాను రాష్ట్రానికి వచ్చినట్టుగా ప్రజలకు తెలిపేందుకే రాహుల్ పై విమర్శలు చేశారన్నారు. Rahul Gandhi పై టీఆర్ఎస్ విమర్శలు సరికాదన్నారు.

Congress పార్టీ ఏం చేసిందని టీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలకు ఆయన సమాధానమిచ్చారు. దేశంలో హరిత విప్లవానికి కాంగ్రెస్ పార్టీ నాంది పలికిందని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రాజెక్టులు నిర్మించి ప్రజలు ఆకలి తీర్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేసిందన్నారు. బీడుపడిన భూములకు నీళ్లిచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని ఆయన గుర్తు చేశారు. సీలింగ్ యాక్టు తీసుకొచ్చి పేదలకు భూములు పంచిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరను తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ‌పార్టీదేనని రేవంత్ రెడ్డి చెప్పారు. 

రైతులకు అధిక దిగుబడులు తీసుకొచ్చేందుకు గాను నాణ్యమైన విత్తనాలతో పాటు హైబ్రిడ్ విత్తనాలు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని రేవంత్ రెడ్డి వివరించారు. ఇక్రిశాట్ లాంటి సంస్థలను నెలకొల్పి రైతులకు ప్రయోజనమైన విత్తన వంగడాల రూపకల్పన చేయడంలో కాంగ్రెస్ పార్టీ కృషి ఉందన్నారు.

2004లో YSR ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చీ రాగానే రూ. 1259 కోట్ల విద్యుత్ బకాయిలను మాఫీ చేశారన్నారు. అంతేకాదు రైతులకు ఉచిత విద్యుత్ ను అమల్లోకి తీసుకొచ్చిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీదేనని రేవంత్ రెడ్డి తెలిపారు.

కష్టకాలంలో రైతులకు అండగా నిలిచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ రెడ్డి చెప్పారు. రుణమాఫీ చేసి రైతు కుటుంబాలను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ దేనని ఆయన చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణ ప్రాధాన్యతను 2004లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీలోనే చేపట్టిందని రేవంత్ రెడ్డి వివరించారు.

తెలంగాణలో TRS సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల రీ డిజైన్ల పేరుతో ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టుల రీ డిజైన్లకు కేసీఆర్ సర్కార్ ప్లాన్ చేసిందని ఆయన విమర్శించారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పేరు మార్చి రకరకాల పేర్లతో దోపీడీ చేస్తున్నారన్నారు.