తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటనపై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బిస్వాల్ కమిటీ లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీ వున్నట్లు నివేదిక ఇచ్చిందని మరి మిగతా ఉద్యోగాలు ఎవరెత్తుకెళ్లారని ఆయన ప్రశ్నించారు. 

కేసీఆర్ (kcr) నిరుద్యోగులనే కాదు… అందర్ని మోసం చేశారని మండిపడ్డారు టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy). బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 12 నెలల్లో ప్రభుత్వం రద్దు అవుతుందని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని రేవంత్ జోస్యం చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం అని టీపీసీసీ చీఫ్ హామీ ఇచ్చారు. 2018లో పే రివిజన్ కమిటీ చైర్మన్ బిస్వాల్ 1.91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇచ్చారని రేవంత్ గుర్తుచేశారు. 61 శాతం ఉద్యోగులతోనే రాష్ట్రం నడుస్తుందని నివేదికలో తెలిపారని... కానీ ఈరోజు నిస్సిగ్గుగా 80 వేల ఉద్యోగాలు ఉన్నాయని అసెంబ్లీలో మాట్లాడుతున్నారని రేవంత్ ఫైరయ్యారు. 

ఉద్యోగాలను ఎవరు ఎత్తుకెళ్లారని నిలదీసిన ఆయన.. కేసీఆర్ ఉద్యోగం ఊడపీకుదాం అని కాంగ్రెస్ (congress) శ్రేణులకు పిలుపు ఇచ్చారు. కేసీఆర్ భయపడి 91 వేల ఖాళీలు ఉన్నాయని చెప్పారని.. ఇది మోసపూరిత ప్రకటన అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ప్రతీ పండగకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తామని చెబుతున్నాడని నిరుద్యోగులను మోసం చేస్తున్నాడని రేవంత్ మండిపడ్డారు. కొంతమంది సన్నాసులు పాలాభిషేకం చేస్తున్నారని.. సీఎం కేసీఆర్ చేసింది ప్రకటనే అని దుయ్యబట్టారు. లక్షా 11 ఉద్యోగ ఖాళీలను కేసీఆర్ మాయం చేశారని… ప్రజలకు సమాధానం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.

అంతకుముందు త్వరలోనే రాష్ట్రంలోని 80,039 ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని ఇవాళ ఉదయం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి ఇప్పటి వరకు 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు 91,147 ఉన్నాయని సీఎం చెప్పారు. అయితే ఇందులో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించగా మిగిలిన 80,039 ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

పోలీస్ శాఖలో 18,334, విద్యాశాఖలో 13,086, వైద్య, ఆరోగ్యశాఖలో 12,755, ఉన్నత విద్యా శాఖలో 7,878, రెవిన్యూ శాఖలో 3,560, బీసీ సంక్షేమ శాఖలో 4,311, గిరిజన సంక్షేమ శాఖలో 2,399, సాగునీటి శాఖలో 2,692 పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ్టి నుండే ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 

మైనారిటీ శాఖలో 1,825,అటవీశాఖలో 1598,పంచాయితీరాజ్ శాఖలో 1455,కార్మిక శాఖలో 1221,ఫైనాన్స్ శాఖలో 1146, మున్సిఫల్ శాఖలో 859, వ్యవసాయ శాఖలో 801, రవాణ శాఖలో 563 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం చెప్పారు.న్యాయ శాఖలో 386,సాధారణ పరిపాలన శాఖలో 343,పరిశ్రమల శాఖలో 233, పర్యాటక శాఖలో 184, సచివాలయం, హెచ్ఓడీ, వర్శిటీల్లో 8,147 ఖాళీలున్నాయని సీఎం వివరించారు. 
ఇక గ్రూప్- 1లో 503,గ్రూపు 2లో 582, గ్రూప్ 3లో1373, గ్రూప్ 4 లో9168, జిల్లా స్ధాయి లో 39,829,జోనల్ స్థాయిలో 18866,మల్టీజోన్ లో13170, అదర్ కేటగిరిలో వర్సిటీలలో 8174 భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 

ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలను గుర్తించి ఉద్యోగ నియమాకాలను చేపడుతామని కేసీఆర్ చెప్పారు. పోలీస్ శాఖ మినహాయించి అన్ని ఉద్యోగాలకు అభ్యర్ధుల వయో పరిమితిని పదేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నామని కేసీఆర్ తెలిపారు. ఓసీలకు 44 ఏళ్లు ,ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లకు వయో పరిమితి పెంచుతున్నట్టుగా కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టమన్నారు. Hyderabad తొలుత ఒక దేశంగా, ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఉందన్నారు. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కోసం 1969లో జరిగిన ఉద్యమంలో తాను 9వ తరగతి విద్యార్ధిగా పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నానని కేసీఆర్ చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్ధిగా మీరు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష, అన్యాయాలతో తెలంగాణ నలిగిపోయిందన్నారు.