గువ్వల బాలరాజు ఘటన డ్రామాయే .. ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా వుంటే ఇవి కామన్ : రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
గువ్వల బాలరాజు డబ్బులు పంచడానికి వెళ్తున్నారని కాంగ్రెస్ నేతలు పోలీసులకు కంప్లైంట్ చేశారని రేవంత్ చెప్పారు. పోలీసులు గువ్వల బాలరాజును అడ్డుకోకుండా కాంగ్రెస్ నేతలపైనే తప్పుడు మాటలు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గువ్వల బాలరాజును డ్రామారావు పరామర్శించి తమపై ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు . కుట్రలు జరుగుతున్నాయి కేటీఆర్ ఆరోపించారని రేవంత్ దుయ్యబట్టారు. బెంగాల్‌లో మమతా బెనర్జీపై దాడి జరగడంతో ఆమె వీల్ చైర్‌పై ప్రచారం చేశారని ఎద్దేవా చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి జరిగినప్పుడు హరీశ్‌రావు బాగా నటించారని రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి అంతా పీసీసీ చీఫ్ ప్రేరేపితమని కల్వకుంట్ల కుటుంబం ప్రచారం చేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సెన్సేషన్ కోసమే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగిందని ఆ జిల్లా ఎస్పీ ప్రకటన చేశారని రేవంత్ తెలిపారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిలో కాంగ్రెస్ ప్రమేయం లేదని ఎస్పీనే చెప్పారని ఆయన గుర్తుచేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఘటనలో ఇప్పటి వరకు రిమాండ్ రిపోర్టు ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రశాంత్ కిషోర్ ఎక్కడ వ్యూహకర్తగా వుంటే.. అక్కడ ఇలాంటి డ్రామాలు కామన్ అని రేవంత్ ఆరోపించారు. మరో 15 రోజుల్లో 3 కుట్రలు జరగబోతున్నాయని కేటీఆర్ అంటున్నారని.. కేటీఆర్ ప్రకటనపై ఎన్నికల అధికారులు ఎందుకు సుమోటోగా కేసు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగినప్పుడు కుట్ర వుందని మొదట చెప్పి.. తర్వాత కేంద్ర అధికారులు నిర్వహణ లోపం అంటున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. గువ్వల బాలరాజే కనిపించిన వారిపై దాడులు చేశారని ఆయన ఆరోపించారు.
ALso Read: నాపై మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ దాడి చేశారు: ఆసుపత్రి నుండి గువ్వల బాలరాజు డిశ్చార్జ్
గువ్వల బాలరాజు డబ్బులు పంచడానికి వెళ్తున్నారని కాంగ్రెస్ నేతలు పోలీసులకు కంప్లైంట్ చేశారని రేవంత్ చెప్పారు. పోలీసులు గువ్వల బాలరాజును అడ్డుకోకుండా కాంగ్రెస్ నేతలపైనే తప్పుడు మాటలు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫాక్స్‌కాన్‌పై కేటీఆర్ తప్పుడు ప్రచారం చేశారని.. బీఆర్ఎస్ , ఎంఐఎం, జేడీఎస్ కలిసి కాంగ్రెస్‌ను ఓడించేందుకు చేసిన కుట్ర విఫలమైందని రేవంత్ రెడ్డి చురకలంటించారు.
బీజేపీతో జేడీఎస్ పొత్తు ఖరారైందని.. అలాంటి కుమారస్వామికి బీఆర్ఎస్‌తో మైత్రి ఏంటని ఆయన ప్రశ్నించారు. కుమారస్వామి ప్రెస్‌మీట్ హరీశ్‌రావు డైరెక్షన్‌లో నడిచిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సైబర్ క్రైమ్‌లో గజరావు భూపాల్ తమ ఫోన్లు హ్యాకింగ్ చేస్తున్నారని పీసీసీ చీఫ్ ఆరోపించారు. ఇంత హ్యాకింగ్ జరుగుతున్నా ఈసీ ఎందుకు మౌనంగా వుందని ఆయన ప్రశ్నించారు. దండుపాళ్యం ముఠా, కాళకేయ ముఠా.. తెలంగాణను పట్టి పీడుస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ నేతలు చేసే డ్రామాలను నమ్మొద్దని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్, హరీశ్‌రావు సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మైనార్టీలను బీసీల్లో ఎందుకు కలుపుతామని ఆయన ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణపై పదేళ్ల క్రితమే బీజేపీ హామీ ఇచ్చినా, ఏం చేయలేదని రేవంత్ దుయ్యబట్టారు . పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెడితే కాంగ్రెస్ బేషరతుగా మద్ధతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌కు అనుకూలంగా వుంటున్న పోలీస్ అధికారుల పేర్లు రెడ్ డైరీలో రాస్తున్నామని రేవంత్ తెలిపారు.