9 ఏళ్లుగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయమై ఊరిస్తున్నారు: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయడంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో తొమ్మిదేళ్లుగా ప్రజలను ఊరిస్తూనే ఉన్నారని సీఎం కేసీఆర్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు.తెలంగాణ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు బహిరంగ లేఖ రాశాడు. ప్రజలకు ఇచ్చిన హమీలపై కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ఆ లేఖలో ప్రశ్నించారు. రైతులకు రూ. లక్ష రుణ మాఫీ ఇంతవరకు అమలు కాలేదన్నారు.
దళితులకు మూడెకరాల భూమి పంపిణీని నెరవేర్చలేదని చెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ని ఉద్దేశ్యపూర్వకంగా నీరుగార్చారని ఆయన విమర్శించారు. గత బడ్జెట్ లో ఈ ప్రాజెక్టుకు కేవలం రూ.125 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. డబుల్ బెడ్ రూమ్ పేరుతో 9 ఏళ్లుగా ఊరిస్తూనే ఉన్నారని తెలిపారు. 9 ఏళ్లలో 21 వేల మందికి మాత్రమే ఇళ్లు అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్వంత ఇంటి స్థలం ఉన్న వాళ్లకు ఇంటి నిర్మాణం కోసం నిధుల మంజూరు విషయమై ఇంతవరకు నిధులు ఇవ్వలేదన్నారు. గత బడ్జెట్ లో ప్రకటించిన ఈ పథకానికి ఇంకా మార్గదర్శకాలు ఇవ్వలేదని తెలిపారు. నిరుద్యోగులకు ఇస్తామన్న రూ. 2016 నిరుద్యోగ భృతి ఏమైందని కేసీఆర్ ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణలో అధికారంలోకి రావడానికి కేసీఆర్ అనేక హమీలను ఇచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హమీలను కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. కేసీఆర్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హమీలను ఇప్పటికైనా అమలు చేయాలని ఆ లేఖలో రేవంత్ రెడ్డి కోరారు.