మునుగోడులో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం చేస్తుండగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తారసపడ్డారు. దీంతో ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. 

మునుగోడు ఉపఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠకు కారణమవ్వగా.. తెలంగాణలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతోన్న తొలి ఉపఎన్నిక కావడంతో ఇక్కడ గెలవాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తం గులాబీ బలగాలను ఇక్కడే మోహరిస్తున్నారు. అటు సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నీ తానై ప్రచారం సాగిస్తున్నారు. అలాగే మూడు ప్రధాన పార్టీలకు పోటీగా బీఎస్పీ కూడా ఇక్కడ తమ అభ్యర్ధిని నిలబెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో మంగళవారం మునుగోడులో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారం చేస్తుండగా రేవంత్ రెడ్డికి.. ప్రవీణ్ కుమార్ ఎదురయ్యారు. దీంతో ఇద్దరు నేతలు అప్యాయంగా పలకరించుకున్నారు. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ కలయిక యాదృచ్చికంగానే జరిగిందని.. సమ సమాజ ఉన్నతి కోసం ప్రవీణ్ లాంటి వారితో కలిసి భావాలు పంచుకోవడం సమాజానికి అవసరమని రేవంత్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి వున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ALso REad:మునుగోడు ఉపఎన్నిక బరిలో బీఎస్పీ.. అందోజు శంకరాచారికి టికెట్, బీసీలే టార్గెట్

కాగా... ఇటీవల బీసీ సామాజిక వర్గానికి చెందిన అందోజు శంకరాచారిని తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అలాగే శంకరాచారికి పార్టీ బీఫామ్‌ను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... మునుగోడులో బీసీ ఓటు బ్యాంక్ అత్యధికంగా వుందన్నారు. ప్రధాన పార్టీలన్నీ అగ్ర వర్ణాల వారికే టికెట్ ఇచ్చాయని.. కానీ బీఎస్పీ మాత్రం బీసీలకు టికెట్ ఇచ్చిందన్నారు. 

ఇకపోతే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన బీజేపీ నుంచి మునుగోడు ఉప ఎన్నిక బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును శనివారం అధికారికంగా ప్రకటించింది. 

ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్ని నవంబర్ 3వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి బరిలో దిగనుండగా.. టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించింది. ఇప్పటికే మునుగోడులో విజయం కోసం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్.. అన్ని విధాలుగా సిద్దమయ్యాయి. క్షేత్ర స్థాయిలో ఓటర్ల మద్దతు కూడగట్టేలా ప్రయత్నాలు ప్రారంభించాయి. 

Scroll to load tweet…