మునుగోడు ఉపఎన్నిక బరిలో బీఎస్పీ.. అందోజు శంకరాచారికి టికెట్, బీసీలే టార్గెట్
మునుగోడు ఉపఎన్నిక బరిలో జాతీయ పార్టీ బీఎస్పీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. దీనిలో భాగంగా అందోజు శంకరాచారి అనే వ్యక్తిని అభ్యర్ధిగా ప్రకటించింది. బీసీలే టార్గెట్‌గా బహుజన్ సమాజ్ పార్టీ ఎత్తుగడ వేసింది.
మునుగోడు ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అన్ని పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలను రచించే పనిలో నిమగ్నమయ్యాయి. దీనిలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ తన అభ్యర్ధిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించింది. అటు కొందరు స్వతంత్రులు కూడా నామినేషన్ దాఖలు చేశారు. అయితే జాతీయ పార్టీ బీఎస్పీ కూడా మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలిచింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన అందోజు శంకరాచారిని తమ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అలాగే శంకరాచారికి పార్టీ బీఫామ్‌ను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... మునుగోడులో బీసీ ఓటు బ్యాంక్ అత్యధికంగా వుందన్నారు. ప్రధాన పార్టీలన్నీ అగ్ర వర్ణాల వారికే టికెట్ ఇచ్చాయని.. కానీ బీఎస్పీ మాత్రం బీసీలకు టికెట్ ఇచ్చిందన్నారు.
ఇకపోతే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆయన బీజేపీ నుంచి మునుగోడు ఉప ఎన్నిక బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును శనివారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయన సోమవారం తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మునుగోడు ప్రజలకు, కేసీఆర్కు మధ్య ఈ పోటీ జరుగుతుందన్నారు. మునుగోడులో జరుగుతున్న ధర్మయుద్ధంలో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. మునుగోడు ఉప ఎన్ని నవంబర్ 3వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి బరిలో దిగనుండగా.. టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ప్రకటించింది. ఇప్పటికే మునుగోడులో విజయం కోసం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్.. అన్ని విధాలుగా సిద్దమయ్యాయి. క్షేత్ర స్థాయిలో ఓటర్ల మద్దతు కూడగట్టేలా ప్రయత్నాలు ప్రారంభించాయి.