Asianet News TeluguAsianet News Telugu

ఇక్కడ జనం చస్తుంటే.. కేసీఆర్‌కు బీహార్‌లో పర్యటనలేంటీ : ఇబ్రహీంపట్నం ఘటనపై రేవంత్ ఫైర్

ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ బీహార్ పర్యటన చేయడం కాదని.. ఇక్కడ చనిపోతున్న వారిని పట్టించుకోవాలని టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి చేశారు. 

tpcc chief revanth reddy fires telangana govt Four women die after undergoing sterilisation at govt hospital
Author
First Published Aug 31, 2022, 4:03 PM IST

ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నంలో ఒక గంటలో 34 మందికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారని అన్నారు. వాళ్లంతా నిరుపేదలేనని.. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని రేవంత్ ఆరోపించారు. అల్లుడు హరీశ్ సమర్ధుడని కేసీఆర్ ఆరోగ్య మంత్రిని చేశారని.. కానీ ఆయన హయాంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ బీహార్ పర్యటన చేయడం కాదని.. ఇక్కడ చనిపోతున్న వారిని పట్టించుకోవాలని టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి చేశారు. 

అంతకుముందు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడి ప్రాక్టీస్ లైసెన్స్ ను రద్దు చేసినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న మహిళలకు  హైద్రాబాద్ నిమ్స్, అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న మహిళలను మంత్రి హరీష్ రావు బుధవారం నాడు పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు.  

ALso REad:ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు: హరీష్ రావు

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిమ్స్ ఆసుపత్రితో పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆయన చెప్పారు. 30 మంది మహిళలకు చికిత్స అందించడం వల్ల ఇన్‌ఫెక్షన్ తగ్గిందన్నారు. ఒక్కరూ కూడా ఐసీయూలో లేరన్నారు. ఇవాళ కొందరిని, రేపు, ఎల్లుండి మిగిలినవారిని డిశ్చార్జ్ చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.  ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండ్ ను కూడా సస్పెండ్ చేశామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న తర్వాత నలుగురు మహిళలు మృతి చెందడం దురదృష్టకరకరమన్నారు.  ఈ ఘటనలో ఇంకా  ఎవరి పాత్ర ఉందని తేలితే వారిపై కూడా చర్యలు తప్పవని ఆయన ప్రకటించారు.

Follow Us:
Download App:
  • android
  • ios