ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు: హరీష్ రావు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసిన డాక్టర్ లైసెన్స్ ను రద్దు చేసినట్టుగా మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ ఘటనలో ఇంకా ఎవరి పాత్ర ఉందని తేలినా వారిపై చర్యలు తీసుకొంటామని ఆయన ప్రకటించారు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసిన వైద్యుడి ప్రాక్టీస్ లైసెన్స్ ను రద్దు చేసినట్టుగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న మహిళలకు హైద్రాబాద్ నిమ్స్, అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న తర్వాత నలుగురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే.
నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను మంత్రి హరీష్ రావు బుధవారం నాడు పరామర్శించారు. నిమ్స్ ఆసుపత్రిలో బాధితుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నిమ్స్ ఆసుపత్రితో పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని ఆయన చెప్పారు. 30 మంది మహిళలకు చికిత్స అందించడం వల్ల ఇన్ ఫెక్షన్ తగ్గిందన్నారు. ఒక్కరూ కూడా ఐసీయూలో లేరన్నారు. ఇవాళ కొందరిని, రేపు, ఎల్లుండి మిగిలినవారిని డిశ్చార్జ్ చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండ్ ను కూడా సస్పెండ్ చేశామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న తర్వాత నలుగురు మహిళలు మృతి చెందడం దురదృష్టకరకరమన్నారు. ఈ ఘటనలో ఇంకా ఎవరి పాత్ర ఉందని తేలితే వారిపై కూడా చర్యలు తప్పవని ఆయన ప్రకటించారు.
also read:ఇబ్రహీంపట్నంలో మరణించిన నాలుగు కుటుంబాలకు కోటి పరిహరం ఇవ్వాలి: బండి సంజయ్ డిమాండ్
ఐదారేళ్లుగా రాష్ట్రంలో 12 లక్షల మందికి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఏ రోజు కూడా ఈ తరహా ఘటనలు చోటు చేసుకోలేదన్నారు. ఇతర రాష్ట్రాలలో ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయని హరీష్ రావు చెప్పారు.
ఈ తరహ ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు గాను సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి చెప్పారు. వారం, పది రోజుల్లో ఈ ఘటనకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలోని వైద్య బృందం నివేదికను ఇవ్వనుందని మంత్రి తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్తలు తీసుకొంటామని మంత్రి హరీష్ రావు వివరించారు.
తాము రాజకీయాలు చేయడం లేదన్నారు. బాధితుల ప్రాణాలను కాపాడామని మంత్రి హరీష్ రావు చెప్పారు. రెండు రోజుల తర్వాత వచ్చిన విపక్ష నేతలు విమర్శలు చేస్తున్నారన్నారు. కానీ తాాము విషయం తెలిసిన నాటి నుండి బాధితులను కాపాడేందకు ప్రయత్నిస్తున్నామని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఇళ్లలో ఉన్న వాళ్ళని కూడా అంబులెన్స్ పంపి ఆస్పత్రికి తీసుకొచ్చినట్టుగా హరీష్ రావు తెలిపారు. గంట గంటకు వైద్యులులు బాధితుల ఆరోగ్య పరిస్థితిని మానిటర్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. ఇన్ ఫెక్షన్ వల్లే నలుగురు మరణించినట్టు ప్రాథమికంగా తెలిసిందని మంత్రి వివరించారు.
i