Asianet News TeluguAsianet News Telugu

ప్రగతిభవన్‌, సచివాలయం ఏం అమ్మైనా సరే.. దళితబంధు ఇవ్వాల్సిందే: కేసీఆర్‌కు రేవంత్ అల్టీమేటం

ప్రగతిభవన్‌, సచివాలయం భూములను అమ్మైనా దళితబంధు అమలు చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి నియోజకవర్గంలో లక్షమందితో దళిత గిరిజన దండోరా నిర్వహించి ‘ఇస్తావా..చస్తావా’ అనే నినాదంతో పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 

tpcc chief revanth reddy fires on trs govt over datlit bandhu ksp
Author
Hyderabad, First Published Jul 31, 2021, 8:18 PM IST

దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. హైదరాబాద్‌ ఇందిరా భవన్‌లో టీపీసీసీ ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో పోడు భూముల పరిరక్షణే ప్రధాన ఎజెండాగా జరిగిన సమావేశంలో రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో  దళిత బంధు కోసం ఏకగ్రీవ తీర్మానం చేయాలని, నిధులు లేకపోతే.. ప్రగతిభవన్‌, సచివాలయం భూములను అమ్మైనా దళితబంధు అమలు చేయాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

దళితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో గిరిజనులపై దాడులు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ.. పోడు భూములను లాక్కుంటున్నారని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. కేసీఆర్‌ గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ.. దళిత, గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. దళితులపై ప్రేమ ఉండి కాదని.. కేవలం హుజూరాబాద్‌ ఎన్నికల కోసమే దళితబంధు పథకం తెచ్చారని రేవంత్ ఎద్దేవా చేశారు.

Also Read:టీఆర్ఎస్‌లో చేరిన పెద్దిరెడ్డి.. దళిత బంధుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

కేసీఆర్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీలకు ఖర్చు చేసిన నిధులు ఎంతో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దళిత, గిరిజన హక్కుల కోసం ఆగస్టు 9న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి నుంచి సమరశంఖం పూరించబోతున్నామని రేవంత్ వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో లక్షమందితో దళిత గిరిజన దండోరా నిర్వహించి ‘ఇస్తావా..చస్తావా’ అనే నినాదంతో పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దళిత బంధు అమలు చేయకపోతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios