Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్‌లో చేరిన పెద్దిరెడ్డి.. దళిత బంధుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

దళితబంధు పథకం ఏడాది ముందే ప్రారంభం కావాల్సి వున్నప్పటికీ కరోనా వల్ల సంవత్సరం ఆలస్యం అయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. కాళ్ళు చేతులు మాత్రమే ఉన్న లక్షలాది దళిత కుటుంబాల బాగుకోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ex minister peddireddy joined in trs party ksp
Author
Hyderabad, First Published Jul 30, 2021, 7:04 PM IST

ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన  కార్యక్రమంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి తనకు సన్నిహిత మిత్రులని.. టీడీపీలో ఆవిర్భావ సమయం నుంచి మంత్రులుగా ఎదిగామని కేసీఆర్ వెల్లడించారు. పెద్దిరెడ్డి సీనియర్ నాయకులని సమాజం పట్ల మంచి అవగాహన ఉందని ప్రశంసించారు. తెలంగాణ అభివృద్ధిలో పెద్దిరెడ్డి ఇకపై భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని కేసీఆర్ తెలిపారు. 

24 గంటల కరెంట్ విషయంలో జానారెడ్డి తో అసెంబ్లీలో సవాల్ చేశానని.. 24 గంటల కరెంటు ఇస్తా అంటే జానారెడ్డి నమ్మలేదని గుర్తుచేశారు. 24 గంటల కరెంటు అమలు అయితే టీఆర్ఎస్ కండువా కప్పుకుంటా అని జానారెడ్డి అసెంబ్లీలో అన్నారని.. కానీ మాట తప్పి మొన్న నాగార్జున సాగర్‌లో పోటీ చేశారని కేసీఆర్ ధ్వజమెత్తారు. చిల్లర అరుపులను పట్టించుకోకుండా అభివృద్ధి కోసం తాము ముందుకు సాగుతామని.. ఏనుగు పోతుంటే చిన్న చిన్న జంతువులు అరుస్తుంటే అవి పట్టించుకోవని సీఎం అన్నారు. ఏనుగు తరహాలో మేము కూడా చిల్లర అరుపులను పట్టించుకొమని స్పష్టం  చేశారు. తెలంగాణ సంపదను పెంచేందుకు తాము ప్రణాళికలు, పథకాలు తెస్తున్నామని.. మనిషి చంద్రుని మీదకు వెళ్లినా దళితులు కఠిన పేదరికంలో ఉండటం మంచిది కాదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు లేవని పార్లమెంట్ లో కేంద్రమంత్రి దీనిపై అధికారిక ప్రకటన చేశారని సీఎం గుర్తుచేశారు. గవర్నమెంట్ ఉద్యోగులు తల్లిదండ్రులకు తిండి పెట్టడం లేదని.. తల్లిదండ్రులను చూడని వ్యక్తులు దేశాన్ని అభివృద్ధి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఏదైనా కొనొచ్చు కానీ తల్లిదండ్రులను కొనలేమని సీఎం హితవు పలికారు. ఎప్పుడూ రాజకీయాలు చేయొద్దని.. ప్రజల సమస్యల పై మానవత్వంతో ఉంటే పరిష్కారం దొరుకుతుందని.. కులం, మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ లైన్‌లో పడిందని ఈ ప్రస్తావన భవిష్యత్ లో కొనసాగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి- చెడు ప్రజలకు తెలుసునన్న ఆయన ఈ ప్రస్థానాన్నీ ప్రజలు కాపాడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. 

దళితబంధు గొప్ప స్కిమ్ అన్న ఆయన... గతంలో ప్రసవానికి హాస్పిటల్ కి పోతే దోపిడీ జరిగేదని, ఒక్కో ప్రసవానికి 70వేలు దోచుకునే వారు ముఖ్యమంత్రి గుర్తుచేశారు. దళితబంధు అంటే బాంబు పడ్డట్లు ప్రతిపక్షాలు భయపడుతున్నాయని సీఎం సెటైర్లు వేశారు. ఆరు నూరైనా దళితబంధు రాష్ట్రం అంతటా అమలు చేసి చూపిస్తామని.. విడతల వారిగా దళితబంధు అమలు చేస్తామని  కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలను మెప్పించి పాలన చేస్తే దాన్ని డెమొక్రాసి అంటారని.. తనను చంపినా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయనని సీఎం వెల్లడించారు. మాటలు చెప్పడం టిఆర్ఎస్ ప్రభుత్వానికి చేతకాదన్న ఆయన ఎమ్మెల్యేల జీతం ఆపి అయినా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. 

పాలమూరు- సీతారాం పూర్తి అయితే తెలంగాణ కాశ్మీరం అవుతుందని.. దళితబంధు పథకం ఏడాది ముందే ప్రారంభం కావాల్సి వున్నప్పటికీ కరోనా వల్ల సంవత్సరం ఆలస్యం అయిందని సీఎం తెలిపారు. కాళ్ళు చేతులు మాత్రమే ఉన్న లక్షలాది దళిత కుటుంబాలు బాగుకోసం ప్రయత్నం చేస్తున్నామని.. తెలంగాణ ధనిక రాష్ట్రం అంటే కొంతమంది సన్నాసులకు అర్థం కావడం లేదంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు. పల్లెలకు సంక్షేమం అందుతుంటే ప్రజలు అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని.. గ్రామాలకు నిధులు వరుసపెట్టి వస్తున్నాయని సీఎం తెలిపారు. తెలంగాణ పథకాలు చూసి 47 మహారాష్ట్ర గ్రామాలు తెలంగాణలో కలుస్తాం అని తీర్మానాలు చేశాయని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. 

దళితుల కోసం భీమా చెయ్యటానికి కొంత టైం పడుతుందని.. రైతుబంధు- భీమా కోసం ఏడాది కాలం పట్టిందని కేసీఆర్ వెల్లడించారు. రాబోయే కొద్దీ రోజుల్లోనే చేనేత కార్మికులకు రైతు బీమా తరహాలో బీమా అందబోతుతందని  సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలే ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయని... ఉద్యమంలో లేని వాళ్ళు తామే తెలంగాణ తెచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటైన కొత్తలో పాత సీఎం కార్లకు తెల్లరంగు వేసి జాగ్రత్తగా వ్యవహరించామమని.. జాగ్రత్తగా పాలన చేస్తేనే ఇవాళ దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగామని సీఎం పేర్కొన్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios