తెలంగాణలో ప్రభుత్వమే భూకబ్జాలకు పాల్పడుతోందని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీనిపై ప్రశ్నిస్తే రైతుల చేతులకు బేడీలు వేసి, భూ కబ్జాలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.  

తెలంగాణలో భూ సమస్యలు పెరిగి పోతున్నాయన్నారు టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) . బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ధరణి సమస్యలతో (dharani portal) ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. భూ సమస్యలతో రైతులు చనిపోతున్నారని, హత్యలు పెరుగుతున్నాయని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఓఆర్ఆర్, ట్రిపులార్ అంటూ రాష్ట్ర ప్రభుత్వమే భూ కబ్జాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. రైతులకు ఆత్మగౌరవంగా వున్న భూమిని కేసీఆర్ (kcr) కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. 

తెలంగాణ ప్రజలు భూమిని కన్నబిడ్డల కంటే మిన్నగా చూసుకుంటారని ఆయన అన్నారు. పోడు భూముల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని ప్రభుత్వం కబ్జా చేస్తున్నారని ప్రశ్నించినందుకు రైతుల చేతికి బేడీలు వేస్తోందని ఆయన మండిపడ్డారు. గిరిజన రైతుల్ని చెట్లకు కట్టేసి కొడుతున్నారని.. జైళ్లలో పెడుతున్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read:కాంగ్రెస్‌లో భారీ చేరికలు ఉండబోతున్నాయి.. వ్యుహాలతో ముందుకెళ్తున్నాం: రేవంత్ రెడ్డి

అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని వరంగల్ డిక్లరేషన్ లో స్పష్టం చేసినట్లు ఆయన వెల్లడించారు. కానీ ఆలోపే జరగాల్సిన నష్టం జరుగుతుందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఫార్మాసిటీ పేరుతో 20 వేల ఎకరాలను ఫార్మాసిటీ పేరుతో గుంజుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ రెండు ప్రాంతాల్లో ఎకరా 3 నుంచి 4 కోట్లు పలుకుతోందని.. అలాంటిది ప్రభుత్వం రూ.8 లక్షలకే ఆ భూములను తీసుకోవాలని చూస్తోందని రేవంత్ మండిపడ్డారు. ఆ భూములను తన అనుయాయులకు కేసీఆర్ కట్టబెడుతున్నారని ఆయన ఆరోపించారు.