ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో మంగళవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నేతల తీరు, తిరుగుబాటు ధోరణిపై చర్చించినట్టుగా తెలుస్తోంది.
సమస్యలను తప్పుదోవ పట్టించడానికే బీజేపీ, టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో కలిసి రేవంత్ రెడ్డి.. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నేతల తీరు, తిరుగుబాటు ధోరణిపై చర్చించినట్టుగా తెలుస్తోంది. యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన సందర్భంగా సీనియర్ నేత వీహెచ్ వ్యవహార తీరు, జగ్గారెడ్డి కామెంట్స్ కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టుగా సమాచారం.
ఈ భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ భేటీలో చర్చించినట్టుగా తెలిపారు. టీఆర్ఎస్, బీజేపీలకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. రాష్ట్రంలో కొన్ని వ్యుహాలు, ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున చేరికలు ఉండబోతున్నాయని అన్నారు. విడత వారిగా చేరికలు ఉండేలా కార్యచరణ సిద్దం చేస్తున్నట్టుగా చెప్పారు. సెప్టెంబర్‌లో మరోసారి తెలంగాణకు రాహుల్ గాంధీ రానున్నారని తెలిపారు. సెప్టెంబర్ 17న సిరిసిల్లలో విద్యార్థి యువజన డిక్లరేషన్ చేపడతామన్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు.
ఎన్డీయే అభ్యర్థి విజయం సాధిస్తారనే నమ్మకం కుదిరిన తర్వాతే.. కేసీఆర్ విపక్షాల అభ్యర్థికి మద్దతిచ్చారని విమర్శించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ సభ పెట్టిందని.. కేసీఆర్ కూడా మరో నెల రోజుల్లో సభ పెట్టాలని సవాలు విసిరారు. ఆ తర్వాత వారం రోజులకు కాంగ్రెస్ సభ పెడతామని.. అప్పుడు తెలంగాణ సమాజం ఎవరి వెనక ఉందో తెలుస్తుందని అన్నారు.
విష్ణు వర్దన్ రెడ్డి లంచ్ మీటింగ్‌కు అందరిని ఆహ్వానించడం జరిగిందని రేవంత్ రెడ్డి అన్నారు. తమను కూడా పిలవడం జరిగిందని కానీ ఢిల్లీలో ఉండటం వల్ల వెళ్లలేకపోయామని చెప్పారు.
