డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరబోతోందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికతో ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లను కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
డిసెంబర్ 9న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరబోతోందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆదివారం ఖమ్మంలో జరిగిన జనగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఖమ్మంలోనే విజయోత్సవ సభ నిర్వహిస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందని టీపీసీసీ చీఫ్ తెలిపారు. కల్వకుంట్ల కుటుంబాన్ని అండమాన్‌కు తరమాలని.. డిసెంబర్ 9నే తెలంగాణ ప్రకటన వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం కొల్లగొట్టిందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు చేసుకున్నారని.. వారిని చూడలేకే సోనియా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికతో ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లను కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మిగిలిన 80 సీట్లను తాము గెలిపించుకుని వస్తామని రేవంత్ పేర్కొన్నారు. ఖమ్మంలో తమ సభ జరుగుతుంటే .. బస్సులు ఇవ్వలేదని, అడుగడుగునా ఆటంకాలు కలిగించారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ గోడలను బద్ధలుకొట్టుకుంటూ కార్యకర్తలు ఖమ్మం సభకు వచ్చారని ఆయన తెలిపారు.
ALso Read: బీఆర్ఎస్ అంటే బీజేపీ బంధువుల పార్టీ.. కేసీఆర్ అవినీతి మోడీకి తెలుసు, అయినా : రాహుల్ సంచలన వ్యాఖ్యలు
వరంగల్ సభలో రైతు డిక్లరేషన్, సరూర్‌నగర్‌లో యూత్ డిక్లరేషన్ ప్రకటించామని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమానికి ఖమ్మం జిల్లాలోనే పునాది పడిందని, కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందన్నారు. మరోసారి తెలంగాణకు విముక్తి కలిగించేందుకు ఖమ్మం నుంచే నాంది పలకాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే భట్టి విక్రమార్క 109 రోజుల పాటు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకున్నారని ఆయన తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో వుంటుందని రేవంత్ రెడ్డి చెప్పారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం రూ.4 వేల పెన్షన్ మీద వుంటుందన్నారు. చేయూత పథకాన్ని ప్రకటించినందుకు రాహుల్ గాంధీకి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
