సెప్టెంబర్ 17పై పూర్తి హక్కులు కాంగ్రెస్‌వేనన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మా తర్వాత వేడుకలు చేసుకునే హక్కు కమ్యూనిస్టులకు వుందని ఆయన పేర్కొన్నారు. నిజాంకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడింది లేదని.. రెండు మతాల మధ్య కొట్లా పెట్టే కుట్రలు చేస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు
తెలంగాణ సాయుధ పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ నేతలతో పాటు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాటి విరోచిత పోరాటాన్ని చూసిన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ ప్రాంత ప్రజలకు కూడా స్వాతంత్య్రం ఇప్పించాలని ఆయన భావించారని రేవంత్ అన్నారు. ఈ విషయమై సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు ఆదేశాలిచ్చారని ఆయన పేర్కొన్నారు. ప్రధాని ఆదేశాలతో రంగంలోకి దిగిన పటేల్.. సైనిక చర్య ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేశారని రేవంత్ తెలిపారు.
సెప్టెంబర్ 17పై టీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ - బీజేపీ అబద్ధాల వాట్సాప్ ఫ్యాక్టరీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నిజాంకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడింది లేదని.. రెండు మతాల మధ్య కొట్లా పెట్టే కుట్రలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. రాజుకు వ్యతిరేకంగా పేదలు చేసిన పోరాటమని.. సెప్టెంబర్ 17 మాదే, హక్కు కూడా మాదేనని రేవంత్ రెడ్డి అన్నారు. మా తర్వాత వేడుకలు చేసుకునే హక్కు కమ్యూనిస్టులకు వుందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్‌కు స్వాతంత్ర్యం ఇప్పించిన పార్టీ కాంగ్రెస్సేనని అన్నారు. మా పేటెంట్‌ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని.. తెలంగాణను కేసీఆర్ తెచ్చారని ప్రజల్లో భ్రమ కల్పిస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉపఎన్నికలో గెలిచేది కాంగ్రెస్సేనని... అక్టోబర్ 24న రాహుల్ పాదయాత్ర తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తుందని ఆయన చెప్పారు. 15 రోజుల పాటు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటిస్తారని.. పాదయాత్రలో భాగంగా 3 భారీ బహిరంగ సభలు నిర్వహిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్, శంషాబాద్, జోగిపేటలో బహిరంగ సభలు నిర్వహిస్తారని ఆయన చెప్పారు.
అంతకుముందు కేసీఆర్, జేడీఎస్ నేత కుమారస్వామి భేటీ పైనా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పెట్టే కొత్త పార్టీలో కుమారస్వామి పార్టీని విలీనం చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను బలహీనపరచాలనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రణాళికలను కేసీఆర్ అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివారం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలను దూరం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. కుట్రలో భాగంగానే కేసీఆర్ జాతీయ స్థాయిలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్‌లు పరస్పరం సహకరించుకుంటున్నాయని విమర్శించారు.
కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్నవారినే కేసీఆర్ కలుస్తున్నాడని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, బీఏస్పీ అధినేత్రి మాయవతి, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేలను కేసీఆర్ ఎందుకు కలవరని నిలదీశారు. కాంగ్రెస్‌తో కలిసి ఉన్న పార్టీల నేతలనే కేసీఆర్ కలవడం వెనక అంతర్యమేమిటని ప్రశ్నించారు.
