ఈడీ విచారణ పేరుతో రాహుల్‌గాంధీకి బీజేపీ వేధింపులు: హైద్రాబాద్ నిరసనలో రేవంత్ రెడ్డి
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ పేరుతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను వేధింపులకు గురి చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైద్రాబాద్ లోని ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్: National Heraldకేసులో Enforcement Directorate విచారణ పేరుతో కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ Rahul Gandhi ని వేధింపులకు గురి చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ Revanth Reddy ఆరోపించారు. హైద్రాబాద్ లోని ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండో రోజున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
మంగళవారం నాడు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాన మంత్రి Narendra Modi కేంద్ర హోంశాఖ మంత్రి Amit Shah లది నేరగాళ్ల మనస్తతత్వమని ఈ కేసుతో తేలిందన్నారు. 11 ఏళ్ల పాటు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకే విచారణ నిర్వహించాలన్నారు. కానీ విచారణ పేరుతో అర్ధరాత్రి వరకు రాహుల్ ను ED కార్యాలయంలోనే ఉంచడం సరైంది కాదన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక నడిస్తే తమ దారుణాలను బయటకు వస్తాయని BJP నేతలు భయపడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయమై గతంలో పలు ఫిర్యాదులు చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈసీకి, కోర్టుల్లో కూడా పిటిషన్లు దాఖలు చేశారన్నారు. కసులు పెట్టాలని కూడా కోర్టులు ఆదేశాలు జారీ చేయలేదని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మనీలాండరింగ్ జరిగిందని కేసు నమోదు చేయాలని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఫిర్యాదు చేస్తే అప్పటి ఈడీ ఉన్నతాధికారి మనీలాండరింగ్ జరగనప్పుడు కేసు ఎలా నమోదు చేస్తామని సుబ్రమణ్యస్వామికి లేఖ రాశాడని రేవంత్ రెడ్డి చెప్పారు.ఈ విషయమై విచారణ కూడా అవసరం లేదని ఈడీ అధికారులు తేల్చి చెప్పారన్నారు. కానీ ఇప్పుడు మరోసారి ఈడీ విచారణ పేరుతో సోనియా, రాహుల్ గాంధీలను వేదింపులకు గురి చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
భారత దేశ భవిష్యత్ కోసం తన రక్తాన్ని దారపోయడానికి సిద్దమని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారన్నారు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు ఇది గుర్తుపెట్టుకోవాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకు ఇంతా వడ్డీతో సహా చెల్లిస్తామని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకోవాలన్నారు. బీజేపీ నేతలు చెప్పినట్లు వింటే రేపు అధికారులు జైలుకు పోయే పరిస్థితి వస్తుందన్నారు. 300సీట్లతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తక్షణమే కేసును ఉపసంహరించుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.. బీజేపీ తీరు మారకుంటే ఈ నెల 23న ఢిల్లీలో ఉన్న ఈడీ ఆఫీసును తెలంగాణ బిడ్డలు ముట్టడించనున్నట్టుగా రేవంత్ రెడ్డి చెప్పారు.