Asianet News TeluguAsianet News Telugu

అంతేలే షా జీ… మీ చీకటి మిత్రుడు కేసీఆర్ పై ఈగవాలనివ్వరుగా!!: రేవంత్ రెడ్డి సెటైర్లు

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కేంద్ర హోంమంత్రి అమిత్  షా ప్రసంగంపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సెటైర్లు వేసారు. 

TPCC Chief Revanth Redddy  Satires on Union Home Minister Amit Shah
Author
Hyderabad, First Published May 15, 2022, 7:39 AM IST

హైదరాబాద్: తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో ముఖ్యఅతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. అయితే అమిత్ షా తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు కొన్ని ప్రశ్నలు సందిస్తూ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు. ఈ ప్రశ్నలకు అమిత్  షా నుండి సమాధానం రాలేదంటూ బిజెపి సభ ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి ఘాటు ట్వీట్ చేసారు. 

''తుక్కుగూడలో అమిత్ షా ప్రసంగం కొండంత రాగం తీసి… అన్నట్టుగా ఉంది. తెలంగాణ ప్రజల తరపున మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం లేదు. కేసీఆర్ కుటుంబ అవినీతి పై ఆర్భాటపు ప్రకటనలే తప్ప ఆచరణతో కూడిన చర్యలు ఉండవని తేలిపోయింది. అంతేలే షా జీ… మీ చీకటి మిత్రుడి పై ఈగవాలనివ్వరుగా!!'' అంటూ రేవంత్ రెడ్డి సెటైర్లు వేసారు. 

రేవంత్ రెడ్డి బహిరంగ లేఖలో సంధించిన ప్రశ్నలు: 

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టుకు కాళేశ్వరం అని పేరు మార్చి, రీ డిజైనింగ్ పేరుతో కేసీఆర్ కమీషన్లు దండుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఎటీఎంలా మారిందని స్వయంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇటీవల పదే పదే వ్యాఖ్యానించారని గుర్తుచేసారు.  అవినీతి జరిగింది అని అంగీకరిస్తున్న కేంద్రం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? నిజాలు మాట్లాడే సొంత పార్టీ నేతలపై కూడా ఈడీ, సీబీఐ ద్వారా కొన్ని గంటల వ్యవధిలోనే దాడులు చేయించే బిజెపి సర్కార్ ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెబుతారా!? అని లేఖ ద్వారా అమిత్ షాను రేవంత్ ప్రశ్నించారు. 

 పంట కొనుగోలు చేయకుండా ఆడిన రాజకీయ డ్రామాలో.. ధాన్యం రైతుల మరణాలకు భాద్యులెవరో సమాధానం చెప్పాలన్నారు. పార్లమెంట్‌లో తెలంగాణ ఏర్పాటుపై అనుచితంగా మాట్లాడిన మోదీ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్‌లో పసుపు  బోర్డు అంటూ బీజేపీ మాట తప్పిందని విమర్శించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 

అయోధ్య నుండి రామేశ్వరం వరకు ఉన్న రాముడి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే విధంగా "రామాయణం సర్క్యూట్"  పేరిట శ్రీ రామాయణ్ యాత్ర ఎక్స్ ప్రెస్ పేరిట రైలును ప్రవేశ పెట్టారు. 7,500 కిలో మీటర్లు సాగే ఈ సర్క్యూట్ లో దక్షిణ అయోధ్యగా ఖ్యాతికెక్కిన మా భద్రాద్రి రాముడుకి చోటు దక్కలేదు. రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి పర్యాటక శాఖ మంత్రిగా ఉండి కూడా మాకు మొండి చెయ్యి చూపారు. దీనికి మీ సమాధానం ఏమిటి? భద్రాద్రి రాముడు రాముడు కాదా!? అయోధ్య రాముడు, భద్రాద్రి రాముడు మీ దృష్టిలో ఒక్కరు కాదా!? అని ప్రశ్నించారు.

ఒడిస్సాలోని నైనీ కోల్ మైన్స్ టెండర్ విషయంలో జరిగిన అవినీతిపై సహచర కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి తానే స్వయంగా కేంద్ర బొగ్గుశాఖ మంత్రి, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని రేవంత్ గుర్తుచేసారు.. ఈ కుంభకోణం వెనుక కేసీఆర్ కుటుంబ పాత్రపై వివరాలు సమర్పించామని... ఇంత వరకు దీనిపై అతీగతీ లేదు. కారణం ఏమిటి? అని ప్రశ్నించారు. 

2014లో మేం అధికారం నుండి దిగిపోయే నాటికి పెట్రోల్ ధర రూ.71.41 పైసలు, డీజిల్ ధర రూ.55.49 పైసలు. గ్యాస్ సిలెండర్ ధర రూ.470 ఉన్నది. నేడు పెట్రోల్ లీటర్ ధర రూ.119.66 పైసలు, లీటర్ డీజిల్ ధర రూ.105.65 పైసలు. గ్యాస్ సిలెండర్ ధర రూ.1052 ఎగబాకాయి. మీరు అధికారంలోకి వచ్చాక దశల వారిగా గ్యాస్ పై సబ్సిడీని పూర్తిగా ఎత్తేశారు. సామాన్యులు బతికే పరిస్థితి లేదు. ప్రతి రోజు ఉదయం పెట్రోలియం ధరల పెరుగుదల వార్తతోనే జనం జీవితాలు మొదలవుతున్నాయి. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇలా ధరల పెరుగుదలతో జన చస్తుంటే మీకు చీమకుట్టినట్టైనా అనిపించడం లేదా? అని అమిత్ షాను రేవంత్ రెడ్డి నిలదీసారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios