రాజగోపాల్ రెడ్డి ఎలా ఎదిగారో.. కాంట్రాక్టులో ఎలా వచ్చాయో.. చర్చకు తాను సిద్ధమని.. చండూరు చౌరస్తాలో బహిరంగ చర్చ చేద్దామంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.  

ఢిల్లీ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో బహిరంగ చర్చకు సిద్ధమని టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చండూరు చౌరస్తాలో బహిరంగ చర్చకు రెడీ అన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎలా ఎదిగారు... ఆయనకు వచ్చిన కాంట్రాక్ట్ లపై చర్చకు సిద్ధమా? అంటూ రేవంత్ సవాల్ చేశారు. ఆర్థిక ప్రయోజనాల కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి ఏ పోరాటం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

తనపై రాష్ట్ర ప్రభుత్వం 120 పైగా కేసులు పెట్టిందని రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజగోపాల్ ఏనాడైనా విమర్శించారా? అని ప్రశ్నించారు. రాజగోపాల్ పై ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలని అన్నారు. కాంగ్రెస్ కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలంగా పని చేస్తున్నారని కొనియాడారు. ఉప ఎన్నికల ప్రచారంలో వెంకట్ రెడ్డి పాల్గొంటారని.. వెంకట్ రెడ్డి గౌరవం తగ్గేలా ఎప్పుడూ మాట్లాడలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉండగా, శుక్రవారం నాడు మునుగోడులో కాల్పుల కలకలం సృష్టించాయి. టూవీలర్ మీద వెళ్తున్న ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు మరో బైక్ పై వెంబడించి.. వెనుక వైపు నుంచి వచ్చి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో భయాందోళనలు రేపింది. మునుగోడు మండలం సింగారం గ్రామ శివారులో బుధవారం రాత్రి ఇది చోటు చేసుకుంది. ఎస్సై సతీష్ రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం …నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి (32) మునుగోడులో కూల్ డ్రింక్స్, నీళ్ల బాటిళ్ల్స్ వ్యాపారం చేస్తుంటాడు. 

శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర కేసులో మరో​ ట్విస్ట్‌.. మంత్రితో సహా 19 మందికి కోర్టు నోటీసులు..

దీంతోపాటు రియల్ ఎస్టేట్ చేస్తూ బ్రాహ్మణ వెల్లంపల్లిలో ఉంటున్నాడు. రోజువారీగా దుకాణం మూసేసి టూ వీలర్ పై తిరిగి ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో మునుగోడు మండలం సింగారం శివారు దాటగానే గుర్తు తెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి రెండు, మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో లింగస్వామి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అది చూసి లింగస్వామి చనిపోయినట్లు భావించిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, కాల్పుల శబ్దం విన్న సమీపంలో ఉన్న స్వామి అనే వ్యక్తి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. 

అప్పటికే లింగస్వామి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. ఘటన జరిగిన స్థలం వద్ద ఓ బుల్లెట్ పడి ఉంది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నల్గొండ డిఎస్పి నరసింహారెడ్డి కామినేని ఆస్పత్రి వద్దకు వెళ్లి పరిశీలించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారితో పాటు మరికొందరిపై అనుమానం ఉందని బాధితులు డీఎస్పీకి చెప్పినట్లు సమాచారం. ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంతో మునుగోడు ఇటీవల వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే.