హైద‌రాబాద్ లో కుండ‌పోత వ‌ర్షం.. ప‌లు ప్రాంతాల్లో నిలిచిన విద్యుత్ స‌ర‌ఫ‌రా

Hyderabad: రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ లో పాటు ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తున్నాయి. మ‌రో మూడు రోజుల  పాటు ప‌లు ప్రాంతాల్లో సాధార‌ణ చిరు జ‌ల్లుల నుంచి ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని ప్రాంతీయ‌ వాతావ‌ర‌ణ విభాగం పేర్కొంది. భారీ వర్షం, బలమైన ఈదురు గాలుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.   
 

Torrential rains in Hyderabad; Power supply stopped in many areas RMA

Heavy Rains: హైద‌రాబాద్ లో కుండ‌పోత వ‌ర్షం కురుస్తోంది. సాయంత్రం చిరు జ‌ల్లుల‌తో మొద‌లైన వ‌ర్షం, ఆ త‌ర్వాత కుండ‌పోత‌గా మారింది. దిల్ షుఖ్ న‌గ‌ర్, ఎల్బీన‌గ‌ర్, హ‌స్తినాపురం, కూకట్ ప‌ల్లి, కేబీహెచ్ బీ, మియపూర్,  కుత్బుల్లాపూర్, బోరబండ, జీడిమెట్ల, ఫిల్మ్‌‌నగర్, బంజారాహిల్స్ స‌హా ప‌లు ప్రాంతాల్లో కుండ‌పోత‌గా వ‌ర్షం కురుస్తోంది. ఇదే స‌మ‌యంలో ఈదురు గాలులు వీచే తీవ్ర‌త పెరిగింది. ప‌లు ప్రాంతాల్లో ఉరుములు మెరుపుల‌తో వ‌ర్షం ప‌డుతోంద‌ని వాతావ‌ర‌ణ నివేదిక‌లు పేర్కొంటున్నాయి.

పాత‌బ‌స్తీలోనూ భారీ వ‌ర్షం కురుస్తోంది. దీంతో రోడ్ల‌పై భారీగా నీరు పారుతోంది. దీంతో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సంబంధిత అధికారులు సూచించారు. కుండ‌పోత వ‌ర్షాల క్ర‌మంలో ప్ర‌జ‌ల‌ను హెచ్చ‌రించిన జీహెచ్ఎంసీ.. అధికారులంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పేర్కొంది. మూసాపేట్, ఎర్రగడ్డ, సనత్ నగర్ పరిసర ప్రాంతాల్లో కుండ‌పోత వ‌ర్షంతో రోడ్ల‌పై నీరు చేరింది. దీంతో వాహ‌న‌దారుల ఇబ్బందులు పెరిగాయి. ప‌లు ప్రాంతాల్లో విద్యుత్తు స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. 

ప్ర‌స్తుత వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌నీ, ఈదురు గాలుల తీవ్ర‌త సైతం పెర‌నుంద‌ని వాతావ‌ర‌ణ నివేదిక‌లు పేర్కొంటున్నాయి. అలాగే, వ‌ర్షాలు సైతం కొన‌సాగుతాయ‌ని తెలుపుతున్నాయి. ఇదిలావుండ‌గా, రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు  కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ పేర్కొంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. పలుచోట్ల పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా  ఉండాలని సూచించింది. బ‌ల‌మైన‌ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. 

 

 

కాగా, వారాంతంలో హైదరాబాద్ లో అసాధారణంగా కురిసిన భారీ వర్షానికి వీధులు జలమయమై వాహనాలు కొట్టుకుపోయాయ‌ని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం, ఏప్రిల్ 1 నుండి 29 వరకు హైదరాబాద్ లో 94 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏప్రిల్ నెలలో సగటున 20.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనప్పటికీ కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయేంత ప‌రిస్థితులుగా మార‌లేదు. అయితే, డ్రైనేజీ కష్టాలతో సతమతమవుతున్న నగరంలో ఇలాంటి వర్షాలకు తగిన మౌలిక సదుపాయాలు లేవంటూ స్థానికులు చిత్రీకరించిన ప‌లు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios