Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం.. పరారీలో నటుడు నవదీప్, నేడు నోటీసులివ్వనున్న నార్కోటిక్...

మాదాపూర్ లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. సినిమా ఇండస్ట్రీకి ఈ కేసులో లింకులు ఉండడంతో మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ చర్చకు వచ్చింది. నటుడు నవదీప్ పరారీలో ఉన్నట్లు సమాచారం. 

Tollywood Drugs Case : actor Navdeep on the run, narcotic to be served notice today - bsb
Author
First Published Sep 15, 2023, 11:58 AM IST

హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాదులో టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. ఈరోజు నటుడు నవదీప్ కు నార్కోటిక్ పోలీసులు నోటీసులు అందజేయనున్నారు. కాగా, నవదీప్ పరారీలో ఉన్నట్లు సమాచారం. మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మోడల్ శ్వేత గురించి గాలింపు చేపట్టారు. అమోబీతో సహా నలుగురు నిందితులను నాంపల్లి కోర్టుకు తీసుకెడుతున్నారు. వీరితో పాటు సినిమా ఇండస్ట్రీకి చెందిన మరో నలుగురు కూడా ఉన్నారు. వీరికి కోర్టు ముందు హాజరు పరిచిన తరువాత రిమాండ్ కోరనున్నారు. 

డ్రగ్స్ కేసులో ఇటీవల పట్టుబడిన సినీ ఫైనాన్షియర్ కె వెంకటరత్నారెడ్డి, మరో నిందితుడైన కాప భాస్కర్  బాలాజీలను టీఎస్ న్యాబ్ (తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ విచారణలో నైజీరియన్లతో  పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారికి సంబంధాలు ఉన్నట్లుగా వెలుగు చూశాయి. కె వెంకటరత్నారెడ్డి, కాప భాస్కర్ ఇచ్చిన సమాచారంతో ముగ్గురు నైజీరియన్లు, మహబూబ్ నగర్ మాజీ ఎంపీ విఠల్ రావు కుమారుడు దేవరకొండ సురేష్ రావు, సినీ దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి, సినీ పరిశ్రమతో సంబంధాలు ఉన్న రాంచంద్ మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

మ‌రిన్నిఉద్య‌మాలు చేస్తాం.. కేసీఆర్ అవినీతి, అక్రమాలను ప్రజల ముందు ఎండగడుతాం.. : బీజేపీ

ఈ నిందితుల నుంచి సుమారు 8 గ్రాముల కొకైన్, 50 గ్రాముల ఎండిఎంఏ, ఎక్టసి మాత్రలు, కార్లు, సెల్ ఫోన్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1.1కోట్లు ఉంటుందని తెలిపారు.  దీంతోపాటు వెంకట రత్నారెడ్డి అకౌంట్లో ఉన్న రూ.5.5 కోట్లను  స్తంభింపజేశారు. ఇక డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్న సినీ నటుడు నవదీప్, షాడో సినిమా నిర్మాత రవి ఉప్పలపాటి, హైదరాబాదులోని  స్నార్ట్ పబ్ యజమాని సూర్యలు పరారీలో ఉన్నట్లుగా టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సివి ఆనంద్ తెలిపారు.

గురువారం ఈ మేరకు వివరాలు తెలియజేస్తూ..  వీరితో పాటు డ్రగ్స్ రవాణాలో సూత్రధారులైన ముగ్గురు నైజీరియన్లు, మరో ఐదుగురు కూడా పరారీలో ఉన్నారని తెలిపారు. దీనికి సంబంధించి మాట్లాడుతూ సివి ఆనంద్..  అమోబి చుక్వుడి (29) నైజీరియాకు చెందిన వ్యక్తి.  అతను  అఖిల భారత నైజీరియా విద్యార్థి, కమ్యూనిటీ సంఘం సభ్యుడిగా… బెంగుళూరులోని ఎలాహంక ఫుట్బాల్ క్లబ్లో సభ్యుడుగా ఉన్నాడు. 

నైజీరియా దేశస్తులు డ్రగ్స్ కేసుల్లో పట్టుబడినప్పుడు…వారికి బెయిల్ ఇప్పించేందుకు.. తిరిగి వారిని తమ స్వదేశానికి పంపేందుకు అమోబి చుక్వుడి నిధులు సమీకరిస్తుంటాడు. అమోబితో కలిసి ఇగ్బావ్రే మైఖేల్ (32), థామస్ అనఘా కలూ (49) అనే నైజీరియాకు చెందిన ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారు. వీరు హైదరాబాద్, బెంగళూరులోని పరిచయస్తులకు అమోబితో కలిసి డ్రగ్స్ అమ్ముతుంటారు. 

వరంగల్లో నివాసముండే విశాఖపట్నం వాసి రామ్ కిషోర్ కు వీరితో పరిచయం ఏర్పడింది. రాం కిషోర్ కూడా డ్రగ్స్ స్మగ్లర్. రామ్ కిషోర్ నైజీరియన్లను ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకు చెందిన కాపా భాస్కర్ బాలాజీ (34)కి పరిచయం చేశాడు. బాలాజీకి హైదరాబాదులోని మాదాపూర్ లో ఓ ఇల్లు ఉంది.  మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్స్ లో ఉండే బాలాజీ అక్కడ తన స్నేహితులతో పార్టీలు చేసుకుంటూ ఉండేవాడు.

బాలాజీకి నైజీరియన్లతో పరిచయం ఏర్పడిన తర్వాత ఈ పార్టీలకు బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పించి నిర్వహిస్తుండేవాడు. టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ పార్టీలకు హాజరవుతుండేవారు. ఇక బాలాజీ ద్వారానే ఏపీలోని గుంటూరు నెహ్రూ నగర్ కు చెందిన కె వెంకటరత్నారెడ్డి (42)తాను ఏర్పాటు చేసే పార్టీల కోసం కూడా డ్రగ్స్ తెప్పిస్తుండేవాడు.

వెంకట రత్నారెడ్డి కిక్, బిజినెస్ మాన్, ఢమరుకం, లవ్లీ, ఆటోనగర్ సూర్య  లాంటి సినిమాలకు ఫైనాన్షియరుగా ఉన్నారు. బాలాజీ స్నాప్ చాట్ ద్వారా గాడ్స్ హెడ్ పేరుతో డ్రగ్స్ విక్రయాల కోసం ఖాతా తెరిచి సంప్రదింపులు జరుపుతున్నాడు. అయితే, ఈ డ్రెస్ దందాపై టీఎస్ న్యాబ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో టీఎస్ న్యాబ్ ఇన్స్పెక్టర్ రాజేష్ బృందం ఆగస్టు 31వ తేదీన గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో ఉన్న బాలాజీని అరెస్టు చేసింది.  

ఆ తర్వాత మాదాపూర్ లోని ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లో పార్టీ నిర్వహిస్తున్న వెంకటరత్నారెడ్డి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి మురళిలను అరెస్టు చేశారు. వీరిద్దరి ఫోన్లను స్వాధీనం చేసుకుని డేటాను పరిశీలించిన పోలీసులు.. అందులో దొరికిన సమాచారం ప్రకారం ఆమోబి మైఖేల్ థామస్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు హైదరాబాదులో నర్సరీ వ్యాపారం చేస్తున్న విశాఖపట్నం వాసి కొల్లి రాంచంద్ (37),  దేవరకొండ సురేష్ రావు (35), అనుగు సుశాంత్ రెడ్డి (36), ఖమ్మం జిల్లాకు  చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కూరపాటి సందీప్, గుంటూరు జిల్లాకు చెందిన పోకర్ నిర్వాహకుడు పగల శ్రీకర్ కృష్ణప్రణీత్ (32)లను అదుపులోకి తీసుకున్నారు.

వీరి వద్ద తనిఖీలు నిర్వహించగా సురేష్ రావు దగ్గర నాలుగు గ్రాముల డ్రగ్స్ దొరికింది. ఇక, సినీ నటుడు నవదీప్ కు కొల్లి రామచంద్ర డ్రగ్స్ సరఫరా చేసేవాడని తేలింది.  మరోవైపు బాలాజీ నుంచి డ్రగ్స్ ను కొనుక్కునే 13 మంది వినియోగదారులు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు సమాచారం ఇచ్చారు. ఇక వీరిని అరెస్టు చేసే విషయంలో సి వి ఆనంద్ మాట్లాడుతూ.. షాడో  సినిమా నిర్మాత రవి ఉప్పలపాటి, నటుడు నవదీప్, బంజారాహిల్స్ లోని బిస్ట్రో, టెర్రా కేఫ్ యజమాని అర్జున్,  గచ్చిబౌలిలోని స్నార్ట్  పబ్ యజమాని సూర్య, విశాఖపట్నం వాసి కలహర్రెడ్డిలతోపాటు మరికొందరు కూడా పరారీలో ఉన్నారని తెలిపారు. కాగా శుక్రవారం నాడు నటుడు నవదీప్ కు పోలీసులు సమన్లు ఇవ్వనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios