Top Stories: కేసీఆర్ సభ టార్గెట్‌గా రేవంత్ ప్రభుత్వం యాక్షన్.. యాదగిరిగుట్టపైకి ఆటోలు.. బీజేపీ సంకల్ప యాత్రలు
కేసీఆర్ ఈ నెల 13వ తేదీన నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభ టార్గెట్‌కు రేవంత్ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నది. యాదగిరిగుట్టపైకి ఆటో సేవలను పునరుద్ధరించారు. లోక్ సభ ఎన్నికలు కేంద్రంగా బీజేపీ ఐదు సంకల్ప యాత్రలు ప్రారంభిస్తున్నది. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిసింది.
బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. నల్గొండలో ఈ నెల 13వ తేదీన కేసీఆర్ సభ నిర్వహించనున్నారు. నీళ్ల కోసం వెనక్కి తగ్గేది లేదని, కృష్ణా ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పగించి కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టిందని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నది. జలాలు ప్రధాన అంశంగా నల్గొండలో కేసీఆర్ సభ ఉండనుంది. కాగా, ఈ సభను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. ఈ సభకు ఒక్క రోజు ముందే అసెంబ్లీలో ఈ విషయంపై చర్చ జరపాలని నిర్ణయం తీసుకుంది. నల్గొండలో సభకు కేసీఆర్ వచ్చే రోజే జిల్లా వ్యాప్తంగా నిరసనల కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది.
కేసీఆర్ వాదనలు అసత్యం అని, వాస్తవానికి కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించవద్దనేదే తమ విధానం అని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ తెచ్చినప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని పేర్కొన్నారు. కాబట్టి, బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. ఈ నీటి సెంటిమెంట్ లోక్ సభ ఎన్నికల కోసమే కేసీఆర్ ముందుకు తెచ్చారని ఆరోపించారు.
Also Read: TDP: టీడీపీకి ఘోర పరాభవం.. 41 ఏళ్లలో తొలిసారి పెద్ద సభలో టీడీపీ నిల్
బీఆర్ఎస్‌కు మరో షాక్:
లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలేలా ఉన్నది. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ పార్టీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మరో వారం రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు సమాచారం అందింది. లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయడానికి బొంతు రామ్మోహన్ ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది.
యాదాద్రి మీదికి ఆటోరిక్షాలు
యాదగిరిగుట్టపైకి తిరిగి ఆటోరిక్షాలను అనుమతించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంత్ జెండగె, డీసీపీ రాజేశ్ చంద్ర, దేవాదాయ శాఖ అధికారులు జెండా ఊపి అనుమతించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి అథారిటీ పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం ఆటోడ్రైవర్ల పొట్టకొట్టిందని, 2022 మార్చి 22వ తేదీ నుంచి గుట్టపైకి ఆటో సేవలను నిషేధించిందని ఐలయ్య పేర్కొన్నారు. 40 ఏళ్లుగా వారు కొండపైకి ఆటోలు నడిపి పొట్టపోసుకుంటున్నవారని, అందుకే తాము మళ్లీ ఆటో సేవలను పునరుద్ధరిస్తున్నట్టు వివరించారు.
Also Read: Evil: ఏపీలోని ఆ గ్రామంలో భయానక అదృశ్య శక్తి? తెల్లార్లు మెలకువతోనే యువత కాపలా.. అసలేం జరుగుతున్నది?
బాల్క సుమన్‌కు నోటీసులు
సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించి మంచిర్యాల పోలీసులు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు నోటీసులు పంపారు. సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై మంచిర్యాల టౌన్‌కు చెందిన పుడారి తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా ఐపీసీలోని సెక్షన్‌లు 294(బీ), సెక్షన్ 504, సెక్షన్ 506 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక వేళ తన రూడ్ కామెంట్‌లపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేస్తే.. మాజీ సీఎం కేసీఆర్ పై ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులపైనా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
Also Read: రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ భార్య.. ఏ పార్టీ ప్రకటించిందంటే?
బీజేపీ సంకల్ప యాత్రలు
తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రను ప్రకటించారు. లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా నరేంద్ర మోడీని మూడో సారి ప్రధానమంత్రిని చేయడంలో భాగంగా ఈ యాత్రలు ఉంటాయని వివరించారు. ఈ యాత్ర ఫిబ్రవరి 20వ తేదీన మొదలువుతుంది. మార్చి 1వ తేదీన ముగుస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. కొమరం భీం యాత్ర, శాతవాహన యాత్ర, కాకతీయ యాత్ర, భాగ్యనగర యాత్ర, క్రిష్ణమ్మ యాత్రలు చేపడుతామని వివరించారు.