తెలుగు రాష్ట్రాల్లో నేడు పిడుగులు, వడగండ్ల వానలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్ :ఓ వైపు మండిపోతున్న ఎండలు... మరోవైపు అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. కొద్దిరోజులుగా ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర ప్రదేశ్ లో కురుస్తున్నారు. మరికొన్నిరోజులు ఈ వర్షాలు కొనసాగే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు(సోమవారం) ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం కొనసాగనుందన్న హెచ్చరిక ఆయా జిల్లాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.
చత్తీస్ ఘడ్ నుండి తెలంగాణ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించి వుందని... దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్నిచోట్ల ఈదురుగాలులు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల వడగండ్ల వానలు కురిసే అవకాశం వుందని తెలిపారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ప్రమాదముందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, మన్యం, అల్లూరి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఇవాళ పిడుగులు పడే అవకాశాలున్నాయని... ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరించారు. కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు, అక్కడక్కడా పిడుగులు పడే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
Read More విషాదం.. కైవల్యా నదిలో మునిగి ఇద్దరు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
ఇవాళ సాయంత్రం రాయలసీమ జిల్లాల్లో వర్షాలు మొదలై పిడుగులు పడే అవకాశాలున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ ఎండి అంబేద్కర్ తెలిపారు. కాబట్టి వర్షం కురిసే సమయంలో పొలం పనులకు వెళ్లిన రైతులు, కూలీలు, పశువులు, గొర్ల కాపర్లు చెట్లకిందకు వుండకూడదని... సురక్షిత ప్రాంతాల్లో వుండాలని సూచించారు.
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో గోదావరి నదిలో సాగే పాపికొండల యాత్రను ఇవాళ, రేపు రద్దు చేసారు అధికారులు. ఉభయ గోదావరి జిల్లాల్లో అకాల వర్షాలు, ఈదురు గాలుల తరుణంలో పాపికొండల విహారయాత్రను అధికారులు నిలిపివేస్తున్నట్లు పోశమ్మగండి కంట్రోల్ రూమ్ అధికారి ప్రకటించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించాక తిరిగి పాపికొండలు విహారయాత్రకు అనుమతి ఇస్తామని వెల్లడించారు.
