హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ(శుక్రవారం) వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం వుందని వెల్లడించారు. 

ప్రస్తుతం దక్షిణ ఛత్తీస్‌గడ్‌ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... 3.1 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల వరకు ఈ ఆవర్తన ఏర్పడిందని తెలిపారు. దీని ప్రభావంతోనే  తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం వుందని... అంతేకాకుండా ఉత్తర దక్షిణ కోస్తా, రాయలసీమల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్ర వెల్లడించింది. 

ఇటీవల ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసాయి. దీంతో నీటిపారుదల ప్రాజెక్టులతో పాటు నదులు, వాగులు, వంకలు వరదనీటితో నిండుకుండల్లా మారాయి. దీంతో రైతులు వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు.

అయితే గతవారం రోజులుగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయి ఎండలు మండిపోతున్నాయి. దీంతో రైతుల్లో కాస్త ఆందోళన మొదలైన సమయంలో వర్షాలు కురిసే అవకాశం వుందంటూ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది.