Asianet News TeluguAsianet News Telugu

Today Top Stories:అట్టహాసంగా న్యూఇయర్‌ సంబరాలు..గ్యారెంటీలకు ఎన్నికల కోడ్ గండం..కోహ్లీకి ప్రతిష్టాత్మక అవార్డు

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో అట్టహాసంగా న్యూ ఇయర్‌ సంబరాలు, కళ్యాణ లక్ష్మి అమలుపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, అభయ హస్తానికి పార్లమెంటు ఎన్నికల కోడ్ గండం.. హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు, న్యూ ఇయర్ వేళ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బ్యాడ్ న్యూస్.. భారత్‌లో మరింత జోరుగా కరోనా.. భారీగా పెరిగిన యాక్టివ్ కేసులు.. కోహ్లీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు వంటి వార్తల సమాహారం.

today top stories top 10 telugu news for JANUARY 1st,2024 andhra pradesh telangana updates headlines KRJ
Author
First Published Jan 1, 2024, 6:15 AM IST

Today Top Stories: అట్టహాసంగా న్యూ ఇయర్‌ సంబరాలు..

New year celebrations: ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కొత్త సంవత్సర ఆరంభాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. కోటి ఆశలు.. కొంగొత్త ఆశయాలతో కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పుతున్నారు. పాత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలతో సరికొత్త లక్ష్యాలతో నూతన సంవత్సరంలో కాలు అడుగుపెట్టారు. ఈ తరుణంలో చిన్నా పెద్ద అని తారతామ్యం లేకుండా  ప్రజలంతా నూతన సంవత్సర సంబురాల్లో మునిగిపోయారు. కొత్త సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. దేశ రాజధాని మొదలు పలు పట్టణాలు, పల్లెల్లో యువత కేరింతలు కొట్టుడూ 2023కి వీడ్కోలు పలికి.. 2023కి స్వాగతం పలికారు. ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ అంటూ కేకలు వేస్తూ కేక్‌లు కట్‌చేసి ఆటపాటలతో ఎంజాయ్‌ చేస్తూ ఆనంద డోలికల్లో తేలిపోయారు. కొత్త సంవత్సరాన్ని నిండుమనసుతో ఆహ్వానించారు. 

అభయ హస్తానికి పార్లమెంటు ఎన్నికల కోడ్ గండం.. హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు


Praja Palana: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చినట్టు హరీశ్ రావు గుర్తు చేశారు. మార్చి 17వ తేదీ నాటికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తవుతుంది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలోని పరిస్థితులను చూస్తే.. దరఖాస్తుల పర్వాన్ని పార్లమెంటు ఎన్నికల కోడ్ వరకూ లాగేలా ఉన్నారని అనుమానించారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ సాకు చూపి హామీల అమలును జాప్యం చేస్తారేమోనని అనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరిలో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వివరించారు. అసెంబ్లీలో బడ్జెట్ పెట్టకుండా ఓట్ ఆన్ అకౌంట్ పెట్టి దాటేస్తారేమోననీ ఆరోపించారు.

కళ్యాణ లక్ష్మి అమలుపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కల్యాణలక్ష్మి పథకంపై ఎమ్మెల్సీ(MLC) జీవన్‌ రెడ్డి(Jeevan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana) ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నదని తెలిపారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ. లక్ష ఆర్థిక సాయంతోపాటు.. తులం బంగారం ఇస్తామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ డిసెంబర్‌ 7న అధికారంలోకి వచ్చిందని, ఆ తేదీ తర్వాత వివాహం చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులని స్పష్టం చేశారు. విద్యార్థులకు సంబంధించి ప్రకటించిన విద్యా భరోసాను సైతం రానున్న విద్యాసంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పారు.అర్హత కలిగిన ప్రతి వివాహితకు రూ.2500 సాయం అందిస్తామని తెలిపారు.  

న్యూ ఇయర్ వేళ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బ్యాడ్ న్యూస్ 

తెలంగాణవ్యాప్తంగా మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో మహిళా ఉద్యోగులు, కూలీ పనులకు వెళ్లేవారే కాదు సామాన్య మహిళలు సైతం ఆర్టిసి బస్సులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో బస్సుల్లో రద్దీపెరిగి కండక్టర్లు కనీసం టికెట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోతోంది. అలాంటిది ఫ్యామిలీ-24, టీ‌-6 వంటి ఆఫర్ల కింద టికెట్లు జారీచేయడం కండక్టర్లకు కష్టతరంగా మారింది. దీంతో హైదరాబాద్ లో తక్కువ ఖర్చులో ప్రయాణించేందుకు వీలుగా జారీచేస్తున్న ఇలాంటి టికెట్లను జనవరి 1, 2024 నుండి రద్దు చేస్తున్నట్లు టీఎస్ ఆర్టిసి ఎండీ విసి సజ్జనార్ ప్రకటించారు. 

కాంగ్రెస్‌లోకి వై.ఎస్.షర్మిల.. కడప పార్లమెంట్ నుండి పోటీ?

యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీని వై.ఎస్. షర్మిల  కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశం ఉంది. 2024 జనవరిలో షర్మిల తన పార్టీని  కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలతో సహా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,  రాహుల్ గాంధీ  ఇతర నేతలు ఈ నెల  27న ఢిల్లీలో సమావేశమయ్యారు.
 
 ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని కడప పార్లమెంట్ స్థానం నుండి రానున్న ఎన్నికల్లో వై.ఎస్. షర్మిల పోటీ చేసే అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా వై.ఎస్. షర్మిల  కడప నుండి బరిలోకి దిగే అవకాశం ఉందనే చర్చ సాగుతుంది. అయితే అదే జరిగితే వైఎస్ఆర్‌సీపీ నుండి  ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డిని ఆ పార్టీ బరిలోకి దింపుతుందా మరొకరిని బరిలోకి తీసుకువస్తుందా అనేది  త్వరలోనే తేలనుంది. 

భారత్‌లో మరింత జోరుగా కరోనా.. భారీగా పెరిగిన యాక్టివ్ కేసులు

Corona Cases: కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా రాత్రి 8 గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 841 కోవిడ్ కేసులు నమోదైనట్టు కేంద్రం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 4,309కు పెరిగాయి. సుమారు ఏడున్నర నెలల తర్వాత కొత్త కేసులు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి. 227 రోజుల క్రితం అంటే మే 19న గరిష్టంగా 865 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మళ్లీ తాజాగా 841 కొత్త కేసులు రిపోర్ట్ అయ్యాయి.

కొత్త కేసులతోపాటు ముగ్గురు కరోనా రోగులు మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, కర్ణాటక, బిహార్ రాష్ట్రాల నుంచి ఒక్కరి చొప్పున కరోనా పేషెంట్లు మరణించారు. డిసెంబర్ 5వ తేదీ వరకు కరోనా కేసులు నామమాత్రంగానే రిపోర్ట్ అయ్యాయి. కానీ, కరోనా వైరస్ కొత్త వేరియంట్ వచ్చాక కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 

కోహ్లీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు

Virat Kohli: దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్‌ లియోనల్ మెస్సీని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఓడించాడు. ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో విజేతగా నిలిచిన కోహ్లీ ఈ రేసులో  లెజెండరీ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీని ఓడించాడు. ఈ అవార్డుకు 5 లక్షల మంది ఓటు వేయగా.. ఇందులో కోహ్లీకి 78 శాతం ఓట్లు వచ్చాయి. మెస్సీకి కేవలం 22 శాతం ఓట్లు మాత్రమే లభించాయి. మేల్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం నోవాక్ జొకోవిచ్, కార్లోస్ అల్కరాజ్, లెబ్రాన్ జేమ్స్, మాక్స్ వెర్స్టాపెన్, లియోనెల్ మెస్సీ వంటి దిగ్గజాలతో కింగ్ కోహ్లీ పోటీ పడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios