తెలంగాణలో తగ్గిన కరోనా జోరు... పాజిటివ్ కేసుల కంటే రికవరీలే అధికం
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది.
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయం తాజాగా రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన హెల్త్ బులెటిన్ ను పరిశీలిస్తే అర్థమవుతుంది. గతకొద్దిరోజులుగా 2వేలకు పైగా కేసులు బయటపడగా తాజాగా కేవలం 1378 కేసులే నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,87,211కి చేరింది. అయితే ఊరటనిచ్చే విషయమేమిటంటే కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీలే అధికంగా వుండటం. గత 24 గంటల్లో 1932 మంది కరోనా బారినుండి సురక్షితంగా బయటపడ్డారు.
ఇక ఈ వైరస్ తో బాధపడుతూ గత 24గంటల్లో ఏడుగురు ప్రాణాలు వదిలారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో చనిపోయినవారి సంఖ్య 1107కి చేరింది. ఇక కరోనా రికవరీ రేటు జాతీయస్థాయిలో 82.53శాతంగా వుండగా తెలంగాణలో 83.55శాతంగా వుంది. అలాగే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 29వేల పైచిలుకు యాక్టివ్ కేసులుండగా ఇప్పటికే 1,56,431 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 35,465 శాంపిల్స్ ను టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
read more ఊరటనిచ్చేలా కరోనా బులెటిన్...తెలంగాణలో పాజిటివ్ కేసుల కంటే రికవరే అధికం
ఇక జిల్లాలవారిగా చూసుకుంటే జిహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 254 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డిలో110, కరీంనగర్ 78, మేడ్చల్ లో 73, సిద్దిపేటలో 61, వరంగల్ అర్బన్ 58 కేసులు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో కూడా చాలా తక్కువగానే కేసులు నమోదయ్యాయి.